కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలమయ్యింది. ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. ఆర్ధికంగా ప్రతీరంగం కుదేలయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ వ్యక్తి రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదించడమే కష్టంగా మారింది. కానీ ఓ వ్యక్తి సంపాదన మాత్రం గంటకు రూ.127 కోట్లు. అతడే టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్. ఆయన కంపెనీకి చెందిన షేర్లు 8 శాతం పెరగడంతో.. ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో అతడు మొదటి స్థానంలో నిలిచాడు.
మొన్నటి వరకు ప్రపంచంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి ఎలాన్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఎలాన్ నికర సంపాదన విలువ 195 బిలియన్ డాలర్లు. అంటే దాదాపుగా రూ. 14,23,500 కోట్లు. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న ఎలాన్ సంపాదన ఏడాది కాలంలో 150 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే గంటకు సుమారుగా రూ.127 కోట్ల రూపాయల సంపాదనగా చెప్పుకోవచ్చు.
ఇదిలావుంటే.. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 2017వ సంవత్సరం నుంచి ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఈ జాబితాలో భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.