జోయ్ అలుక్కాస్‭కు చెందిన రూ.305 కోట్లు సీజ్

ED attaches over Rs 305 crore worth of assets of Joyalukkas jewellery group. దేశంలో అతిపెద్ద ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‭ వివాదంలో ఇరుక్కుంది.

By M.S.R  Published on  25 Feb 2023 12:52 PM GMT
జోయ్ అలుక్కాస్‭కు చెందిన రూ.305 కోట్లు సీజ్

దేశంలో అతిపెద్ద ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‭ వివాదంలో ఇరుక్కుంది. హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి భారీ నగదు బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఫెమా కేసులో కేరళకు చెందిన ప్రముఖ జ్యువెలరీ గ్రూప్ జోయాలుక్కాస్ యజమానికి చెందిన రూ. 305 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ జాయ్ అలుక్కాస్ వర్గీస్ యాజమాన్యంలోని త్రిస్సూర్ ప్రధాన కార్యాలయానికి చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఈ ఆస్తుల అటాచ్‌మెంట్ జరిగింది.

జోయ్ అలుక్కాస్ కార్యాలయాల్లో 5 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 305 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. హవాలా ద్వారా భారత్ నుంచి దుబాయ్ కు భారీ మొత్తంలో నగదును బదిలీ చేసి ఆ తర్వాత జోయ్ అలుక్కాస్ వర్గీస్ కు చెందిన జోయ్ అలూక్కాస్ జ్యూవెలరీ LLC దుబాయ్ లో పెట్టుబడి పెట్టింది. జోయ్ అలుక్కాస్ రూ.2,300 కోట్ల ఐపీవో ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సీజ్ చేసిన వాటిలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్తులు ఉన్నాయి. రూ. 91.22 లక్షలు ఉన్న 3 బ్యాంకు ఖాతాలు, రూ. 5.58 కోట్ల విలువైన 3 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 217.81 కోట్ల విలువైన జోయ్ అలుక్కాస్ షేర్లను కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జోయ్ అలుక్కాస్‌కు దేశవ్యాప్తంగా 68 శాఖలు ఉన్నాయి. హవాలా లావాదేవీల్లో జాయ్ అలుక్కాస్ ప్రమేయం ఉన్నట్లుగా అధికారిక పత్రాలు, సోదాల సమయంలో సేకరించిన సాక్ష్యాలు స్పష్టంగా నిరూపిస్తున్నట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.


Next Story