కొండెక్కిన కొత్తిమీర.. భారీగా పెరిగిన ధర
Coriander prices hikes in Warangal.వంటకం ఏదనా కానీ కొంచెం కొత్తిమీర వేయగానే గుమగుమలతో వంట రుచే మారిపోతుంది.
By తోట వంశీ కుమార్ Published on 18 Sept 2022 10:06 AM ISTమాంసాహారం కానీ, శాఖాహారం కానీ.. వంటకం ఏదనా కానీ కొంచెం కొత్తిమీర వేయగానే గుమగుమలతో వంట రుచే మారిపోతుంది. మాంసాహార వంటకాల్లో కొత్తిమీర వేయకపోతే గొంతు దిగదు. కొత్తమీరకున్న ఆరోగ్య ప్రయోజనాలు తక్కువేం కాదు. అందుకనే వంటింట్లో కొత్తిమీర లేకపోతే గృహిణులకు ఇబ్బందే. అయితే.. ఇప్పుడు కొత్తిమీరను కొనాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. ధరలు కొండెక్కి కూర్చోవడంతో మధ్య తరగతి వారికి ఆందోళన తప్పడం లేదు.
రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీ పడుతోంది కొత్తిమీర. మార్కెట్‌లో రూ.10 పెడితే కొత్తిమీర కట్ట వచ్చేది. ఇప్పుడు రూ.50 పెట్టితే గానీ దొరకని పరిస్థితులు వచ్చాయి. డిమాండ్‌కు సరఫరా సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరిగిపోయింది. కిలో సాధారణంగా రూ.80 నుంచి రూ.100 మధ్య ఉండే కొత్తిమీర ఏకంగా రూ.400కి పెరిగింది.
కర్ణాటక నుంచి ఎక్కువగా వరంగల్, ఖమ్మం మార్కెట్లకు కొత్తిమీర సరఫరా అవుతోంది. అయితే..ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో అరకొరగా వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు ఎగబడుతుండడంతో దాని ధర కొండెక్కింది. నిన్న పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా.. ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని.. అందుకనే ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.