దుకాణదారుడు అమ్మిన వస్తువు 'రిటర్న్' తీసుకోవట్లేదా.? ఇలా చేయండి..!
షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు దుకాణాల్లో ఒక విషయాన్ని చదివి ఉంటారు. ఒకసారి కొనుగోలు చేసిన వస్తువును తిరిగి తీసుకోమని(నో రిటర్న్) వ్రాసి ఉండటం మనం గమనించివుంటాం.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 4:57 AM GMTషాపింగ్ చేస్తున్నప్పుడు మీరు దుకాణాల్లో ఒక విషయాన్ని చదివి ఉంటారు. ఒకసారి కొనుగోలు చేసిన వస్తువును తిరిగి తీసుకోమని(నో రిటర్న్) వ్రాసి ఉండటం మనం గమనించివుంటాం. దుకాణదారుల ఈ నిర్ణయం వినియోగదారుడి హక్కును ఉల్లంఘించడమే. దీనికి గుజరాత్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. షాప్ లేదా మాల్ నుండి కొనుగోలు చేసిన వస్తువును అదే రూపంలో తిరిగి ఇచ్చే హక్కు కస్టమర్‌కు ఉందని గుజరాత్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దుకాణదారుడు దానిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించకూడదని ఈ సర్క్యులర్ చెబుతుంది. ఒక వ్యాపారి విక్రయించిన వస్తువులను తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తే.. అతనిపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయవచ్చని గుజరాత్ ప్రభుత్వ సర్క్యులర్ పేర్కొంది. నేరం రుజువైతే వ్యాపారవేత్తపై జరిమానా, శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. అమ్మిన వస్తువులను వెనక్కి తీసుకోనందుకు గుజరాత్‌లోని కోర్టులు, ఫోరమ్‌లలో 70 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
అహ్మదాబాద్‌లోని ఓ షోరూమ్‌లో ఓ మహిళ తన భర్త కోసం రూ.16 వేల విలువైన వాచ్‌ను కొనుగోలు చేసింది. వాచ్ బెల్ట్ చిన్నదిగా ఉండటంతో భర్త మణికట్టుకు సరిపోలేదు. దీంతో ఆ మహిళ వాచ్‌ని రిటర్న్ చేద్దామని అనుకుంది. అయితే.. షోరూమ్ యజమాని ‘ఒకసారి విక్రయించిన వస్తువు రిటర్న్ తీసుకోబడదు’ అని వెనక్కి పంపారు. దీంతో ఆ మహిళ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దుకాణదారుడు వస్తువులను అమ్మి కస్టమర్ అవసరానికి సరిపోలకపోతే.. దానిని తిరిగి ఇచ్చే హక్కు వినియోగదారుకు ఉంటుంది. దుకాణదారుడు వస్తువును వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తే.. వినియోగదారుడు ఫిర్యాదు చేయవచ్చు.
వస్తువు లోపభూయిష్టంగా ఉంటే.. దానిని భర్తీ చేసుకునే హక్కు వినియోగదారునికి ఉంటుంది.
కస్టమర్ లోపభూయిష్ట వస్తువులను తిరిగి ఇస్తే.. దుకాణదారుడు వస్తువుల ధర వాపసు చేయాలి.
కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా వినియోగదారుడు ఏదైనా నష్టాన్ని చవిచూస్తే.. వినియోగదారుడు కూడా పరిహారం పొందవచ్చు.
దుకాణదారుడు ఈ నిబంధన పాటించడానికి నిరాకరిస్తే వినియోగదారు జిల్లా వినియోగదారుల ఫోరం, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లేదా జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లేదా వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.
వినియోగదారులు తమ ఫిర్యాదులను హెల్ప్‌లైన్ నంబర్ 1800-11-4000లో నమోదు చేసుకోవచ్చు. ఇది వినియోగదారులకు వారి హక్కుల గురించి సమాచారాన్ని అందించే జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్ నంబర్.