సామాన్యులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. దీంతో వంటగ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం పడనుంది. గృహ వినియోగానికి ఉపయోగించే(14.2 కేజీల డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ పై రూ.50, 19 కేజీల వాణిజ్య సిలిండర్ పై రూ.350.50 మేర పెంచేశాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119కి చేరింది. అలాగే కోల్‌కతాలో రూ.1870 నుంచి రూ. 2221కు, ముంబైలో రూ. 1721 నుంచి రూ. 2071కు, చెన్నైలో రూ. 1917గా నుంచి రూ. 2268కి పెరిగింది.
ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీలో ఈ సిలిండర్ రేటు రూ. 1103కు చేరింది. ముంబైలో రూ. 1102, కోల్‌కతాలో రూ. 1129, చెన్నైలో రూ. 1118కు పెరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే తొలిసారి.హైదరాబాద్‌లో రూ.1155, ఏపీలో రూ.1161గా ఉంది.
ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.