వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర
Commercial Gas Cylinder has increased by RS 104 from today.కరోనా మహమ్మారి అనంతరం దేశంలో అన్నింటి ధరలు
By తోట వంశీ కుమార్ Published on 1 May 2022 9:30 AM ISTకరోనా మహమ్మారి అనంతరం దేశంలో అన్నింటి ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. తాజాగా ఎల్‌పీజీ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై భారీగా వడ్డించాయి ఆయిల్ కంపెనీలు.
ప్రతి నెలా 1వ తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. నెలవారీ సమీక్షలో భాగంగా నేడు(మే 1) వాణిజ్య సిలిండర్ పై రూ.104 పెంచాయి. అయితే.. 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఎలాంటి పెంపు లేదు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563.5కి పెరిగింది. గతంలో ఇది రూ.2460గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో రూ.102.5లు పెరగడంతో రూ.2355.5కు చేరింది. ముంబైలో రూ.2329.50, కోల్‌కతాలో రూ.2477.50, చెన్నైలో రూ.2508కి, విశాఖపట్టణంలో రూ.2413కి, విజయవాడలో రూ.2501కి పెరిగింది. కాగా..గత నెల (ఏప్రిల్)1న కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ.268.5 వడ్డించిన సంగతి తెలిసిందే. కేవలం రెండు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ.372 మేర పెరిగింది.
వాణిజ్య సిలిండర్ ధరలు పెరుగుతుండడంతో హోటల్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు రేట్లను పెంచే అవకాశం ఉంది. ఇక సామాన్య ప్రజలు వినియోగించే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెరగలేదు. గత నెల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటున రూ.50 పెంచారు.