కొండెక్కిన చికెన్ ధర
Chicken Price Hike. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుంటే తాజాగా చికెన్ ధర కూడా భగ్గుమంటోంది.
By Medi Samrat Published on 8 March 2021 9:02 AM GMTఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుంటే తాజాగా చికెన్ ధర కూడా భగ్గుమంటోంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే చికెన్ ధర తెలంగాణ రాష్ట్రంలో అమాంతంగా పెరిగిపోయింది. దీంతో మధ్య తరగతి వారికి ఇదో భారంగా మారింది. ఒక్క వారంలోనే రూ.70 వరకు పెరిగింది. ఆదివారం కిలో చికెన్ ధర రూ. 200 నుంచి 250 వరకు పలికింది. దీంతో
బర్డ్‌ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధర మళ్లీ ఆకాశాన్ని తాకుతోంది. వారం వ్యవధిలోనే కిలోకు రూ.50-70కి పైగా పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లోని కిలో చికెన్ ధర రూ.250 వరకు తాకిందంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గత వారం రూ.160-180 మధ్య ఉన్న కోడి మాంసం ధర ఒక్క వారంలోనే రూ.250కి చేరుకోవడం చికెన్ ప్రియులకు భారంగా మారింది.
అయితే బర్డ్ ఫ్లూ ప్రచారంతో తెలంగాణలో కోళ్ల ఉత్పత్తిని చాలామంది నిలిపివేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగిన సరఫరా చేయలేకపోతున్నామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని, ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. సుమారు రెండు సంవత్సరాలుగా తాము అనేక ఇబ్బందులకు గురయ్యామని, కరోనా పౌల్టీ పరిశ్రమను మరింత కుంగదీసిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెరుగుతున్న ధరతో పరిశ్రమ కొంత కోలుకునే అవకాశముందంటున్నారు. మునుముందు ఇంకా ధరలు భారీగా పెరిగే అవకాశమున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే సామాన్యులు చికెన్ తినడం కష్టంగానే మారనుంది.