షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పల్లోంజీ చేసిన కృషికి గానూ ఆయన్ను కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ భూషణ్‌తో సత్కరించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం పల్లోంజీ మిస్త్రీ సంపద విలువ దాదాపు 29 బిలియన్ డాలర్లు. ఈయనకు నలుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.
1929లో పల్లోంజి మిస్ట్రీ జన్మించారు. ముంబైలోని క్యాథేడ్రాల్ అండ్ జాన్ కెనాన్ పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం లండన్‌లోని ఇంపేరియల్ కాలేజ్‌లో ఉన్నత చదువులను అభ్యసించారు. 18 ఏళ్ల వయసులోనే తన కెరీర్ ప్రారంభించారు. ఫ్యామిలీ బిజినెస్ చూసుకునే వారు. 1970లో అబుదాబి, దుబాయ్, ఖతర్ వంటి దేశాల్లో వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.
పల్లోంజీ గ్రూప్‌ను 1865లో స్థాపించారు. ఆఫ్రికా, భారత్, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పల్లోంజీ కంపెనీ ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారం సాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్జీ పల్లోంజీ సంస్థనే నిర్మిస్తోంది.