Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటనలు
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు.
By - అంజి |
Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటనలు
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. దేశం 7 శాతం వృద్ధి రేటుతో స్థిరంగా ముందుకు సాగుతోందని, సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు.
మూడు ప్రధాన కర్తవ్యాలతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామని, ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించి, వికసిత భారత్ సాధనలో భాగంగా యువత ఆకాంక్షలకు, పేదలు, ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు చెప్పారు. 7 శాతం వృద్ధి రేటుతో దేశ ఆర్థిక ప్రయాణం సుస్థిరంగా సాగుతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
బయో ఫార్మా శక్తి పథకం
కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా రూ.10,000 కోట్లతో బయో ఫార్మా శక్తి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా 1000 అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సైట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నట్టు తెలపిఆరు. ఎంఎస్‌ఎంఈలను గ్లోబల్ ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించడమే కాకుండా, పరిశోధనల కోసం మూడు కొత్త నైపర్ సంస్థల స్థాపనను వెల్లడించారు. ఈ చర్యలు ఔషధ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.
సెమీకండక్టర్ మిషన్ 2.O
దేశ సెమీ కండక్టర్ రంగం వృద్ధి కోసం సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.Oను కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందు కోసం రూ.40 వేల కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు పథకం ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
7 హైస్పీడ్ రైళ్లు.. హైదరాబాద్‌కు కూడా..
కేంద్ర బడ్జెట్ 2026లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి నిర్మల 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ముంబై - పుణే, పుణే - హైదరాబాద్, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, ఢిల్లీ - వారణాసి, వారణాసి - సిలిగిరి, చెన్నై - బెంగళూరు మధ్య ఏడు కారిడార్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
ఎన్నారైల కోసం
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించింది. సీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి తెలిపారు. కొత్తగా డిడికేటెట్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వారణాసి, పాట్నాల్లో షిప్ రిపేర్ కర్మగారం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం
దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఆతిథ్యరంగరంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌లను నియమించనున్నట్టు తెలిపారు. సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం, మూడు ఆయుర్వేద ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలమ్మ ప్రకటించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌పై కేంద్రమంత్రి నిర్మల కీలక ప్రకటన చేశారు. తాము సవరించిన కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ -2025.. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. సామాన్యులకు అనుగుణంగా ఈ యాక్ట్‌లో సవరణలు చేసినట్టు వెల్లడించారు.