పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కాస్త ఊరట లభించనుంది. వంటనూనెల ధరలు లీటరుకు 15 రూపాయల వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో దేశీయంగానూ వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. పామాయిల్ ధర లీటరుకు రూ.7-8 తగ్గగా, సన్‌ఫ్లవర్ నూనె ధర లీటరుకు రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గింది. సోయాబీన్ నూనె కూడా లీటరుకు రూ.5 తగ్గిందని భారతీయ వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు దేశాయ్ వెల్లడించారు.
ఇక.. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ నూనె ధరను గత వారంలో లీటరుకు రూ.15-20 తగ్గించామని హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ తెలిపింది. ఈ వారం మరో రూ.20 తగ్గిస్తామని చెప్పుకొచ్చింది. ఏప్రిల్‌తో పోలిస్తే భారతదేశం పామాయిల్ దిగుమతులు మేలో 10 శాతం తగ్గాయి. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతుల్ని నిషేధించడంతో భారత్ కు దిగుమతులు తగ్గాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఏప్రిల్‌లో 5,72,508 టన్నుల పామాయిల్ దిగుమతి చేస్తే , మేలో 5,14,022 టన్నుల పామాయిల్ దిగుమతి చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతిదారుగా ఉంది. పామాయిల్ కోసం ఇండోనేషియా, మలేషియాలపై ఆధారపడుతోంది. భారతదేశం ప్రతి సంవత్సరం 13.5 మిలియన్ టన్నులకు పైగా వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటోంది.