లోన్ యాప్‌లలో అప్పు తీసుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి
డిజిటల్ రుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా ప్రజలకు దగ్గర అవుతున్నాయో తెలియట్లేదు. లోన్ ఇవ్వడం, దానికి వర్తించే వడ్డీ రేట్లు, కనిపించని షరతలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
By అంజి Published on 18 March 2024 11:14 AM ISTలోన్ యాప్‌లలో అప్పు తీసుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి
ష్యూరిటీ లేకుండా లోన్లు ఇచ్చే యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల పొదుపు శక్తి తగ్గడంతో వీటి మీద ఆధారపడే వారి సంఖ్య వేగంగా పెరిగింది. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు వంటివి ఆర్బీఐ పరిధిలోకి వస్తాయి. కానీ ఈ డిజిటల్ రుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా ప్రజలకు దగ్గర అవుతున్నాయో తెలియట్లేదు. లోన్ ఇవ్వడం, దానికి వర్తించే వడ్డీ రేట్లు, కనిపించని షరతలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అంతేకాకుండా వీరి వసూలు విధానం ఎంత దారుణంగా ఉంటుందో అనేక ఘటనల్లో చూస్తున్నాం. వీటన్నింటికీ స్వస్తి పలికేందుకు ఆర్బీఐ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి రుణ గ్రహీతలను ఈ దారుణ యాప్‌ల నుంచి రక్షిస్తాయి.
మారిన నిబంధనలు
- డిజిటల్ లోన్ యాప్‌లు నేరుగా రుణ గ్రహీతతోనే లావాదేవీలు నిర్వహించాలి. రుణాన్ని ఇచ్చేందుకు, వసూలు చేసేందుకు ఎలాంటి మధ్యవర్తులు ఉండకూడదు. పేమెంట్స్, వసూలు అన్నీ రుణ గ్రహీత, రుణదాత ఖాతాల మధ్యే జరగాలి.
- తీసుకునే లోన్‌పై విధించే వడ్డీలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఛార్జీలన్నీ పారదర్శకంగా ఉండాలి. అన్ని రకాల రుణాల్లోనూ దీన్ని విధిగా పాటించాలి. దీనికి సంబంధించిన కేఎఫ్‌ఎస్‌ను కచ్చితంగా రుణదాతలు అందించాలి.
- తిరిగి చెల్లించే శక్తి, గతంలోని ఆర్థిక చరిత్రను లోతుగా విశ్లేషిస్తాయి. ఆదాయానికి మించి వాయిదాలు చెల్లించే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త. దీన్ని డిజిటల్ లోన్ యాప్‌లు ఇక నుంచి చేపడతాయి.
- లోన్ మంజూరయ్యాక దానికి సంబంధించిన కీలక పత్రాలన్నీ వినియోగదారులకు డిజిటల్ రూపంలోనే అందుతాయి. రుణానికి సంబంధించిన వివరాలతో పాటు, వ్యక్తిగత గోపత్యకు పాటించే నియమాలు అందులో ఉంటాయి.
- ముఖ్యంగా ఇందులో తిరిగి ఇచ్చే సౌకర్యం కల్పించడం ఉపయోగపడే అంశం. తొందరపాటుతో, లేదా అవసరం లేకున్నా లోన్ తీసుకుంటే ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయొచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు వర్తించవు. ఎక్కువ కాలానికి అంటే 7 రోజులు అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకునే లోన్ వెనక్కి ఇచ్చేందుకు కనీసం మూడు రోజులు కాల వ్యవధి ఉండాలి. అలాగే ఏడు రోజుల కంటే తక్కువ వ్యవధికి తీసుకునే లోన్‌కి మాత్రం ఒక్క రోజులో చెల్లించాల్సి ఉంటుంది.
- వాయిదాలు చెల్లించని సందర్భంలో లోన్ వసూలుకు ఎవరు వస్తారనేది రుణగ్రహీతలకు తెలిసి ఉండాలి. తమ రికవరీ ఏజెంట్ల గురించి ముందుగానే తెలియజేయాలి.
- చివరగా.. రుణదాతలు మీ అనుమతి లేకుండా మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోలేరు. మీ నుంచి సేకరించిన వివరాలను దేనికి ఉపయోగిస్తున్నారో కచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటాయి. డిజిటల్ లోన్ తీసుకునేటప్పుడు నిబంధనలన్నీ పాటిస్తున్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్నాకే అప్పు గురించి నిర్ణయం తీసుకోండి.