ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ దిగ్గజం, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు(ఆదివారం) ఉదయం 6.45 గంటలకు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం పట్ల పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
1985లో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు. ఇటీవలే ఆయన విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది.