బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ షాక్.. ఇకపై ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్
Banks have to pay fines if ATMs run out of cash.
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2021 8:37 AM ISTమనలో చాలా మంది నగదు కోసం ఏటీఎంలకు వెలుతుంటాం. అయితే.. మన పరిధిలో ఉండే ఏటీఎంలో చాలా వాటిలో నగదు అసలే ఉండదు. కొన్నింట్లో మాత్రమే నగదు ఉంటుంది. ఆ ఏటీఎంల కాడా.. చాతాండ క్యూ ఉంటుంది. దీంతో చాలా సమయం వృధా అవుతుంటుంది. ఇక మన అకౌంట్‌లో మినిమం బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు మన నుంచి అడిషనల్ చార్జీలు వసూలు చేస్తాయి. మరీ ఏటీఎంలలో నగదు లేకపోతే.. వాటికి పైన్ వేయరా అని మనలో చాలా మంది ప్రశ్నిస్తుంటారు.
ఏటీఎంలలో నగదు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా( ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది. ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. డబ్ల్యూఎల్‌ఏవోల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బులు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఈ ఏడాది జూన్ చివరి వరకు దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి.