ఉద్యోగులకు తీపి కబురు.. ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట
దేశంలోని ఉద్యోగులకు తీపి కబురు తీసుకొచ్చింది అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్‌సీ. వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి అయ్యింది.
By అంజి Published on 26 Feb 2024 12:58 AM GMTఉద్యోగులకు తీపి కబురు.. ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట
దేశంలోని ఉద్యోగులకు తీపి కబురు తీసుకొచ్చింది అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్‌సీ. 2024లో వేతనాలు సగటున 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ చేసిన సర్వేలో వెల్లడి అయ్యింది. ఈ సర్వేలో భాగంగా 45 రంగాలకు చెందిన 1411 కంపెనీల డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించింది. సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా వ్యూహాత్మక సర్దుబాటును సూచిస్తోందని పేర్కొంది. మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తాయని.. మరికొన్ని రంగాలకు పెట్టుబడులు అవసరం అవుతాయని వివరించింది.
అలాగే దేశంలో ఉద్యోగాల పోటీ ఎక్కువగానే ఉందని పేర్కొంది. ఈ మాటలతో నిరుద్యోగుల్లో ఆశ చిగురించింది. కరోనా పరిణామాల తర్వాత 2022లో దేశంలో అధిక వేతనాలు లభించాయి. దాని తర్వాత మళ్లీ ఈ ఏడాదిలో గరిష్ఠ స్థాయిలో వేతనాలు పెరుగుతాయని తెలిపింది. ప్రాంతాల వారీగా రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ మిగతా దేశాలతో పోల్చుకుంటే మొదటి స్థానంలో కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయని పేర్కొంది.
2014లో ఈ రెండు దేశాల్లో సగటు వేతన పెంపు 7.3 నుంచి 6.5 శాతంగా ఉండనుందని పేర్కొంది. ఇదిలా ఉంటే మన దేశంలో వలసల రేటు 2022లో 21.4 శాతంగా ఉండగా, 2023లో అది 18.7 శాతానికి పరిమితమైందని సర్వే తెలిపింది. అలాగే జీతాల పెరుగుదలను రంగాల వారీగా సర్వే ప్రకారం వివరించాలంటే.. ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగ్, వాహన, లైఫ్ సైన్సెస్ రంగరాల్లో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. రిటైల్, టెక్నాలజీ, కన్సల్టింగ్, సేవల రంగాల్లో వేతన పెంపు తక్కువగా ఉండొచ్చని సర్వేలో పేర్కొంది.