ట్విట్టర్, మెటా బాటలో అమెజాన్.. 10 వేల ఉద్యోగాలు ఫట్.!
Amazon plans to lay off 10,000 of its workforce..Report. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ఈ వారం నుంచి కంపెనీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు
By అంజి Published on 15 Nov 2022 11:38 AM ISTప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ఈ వారం నుంచి కంపెనీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు ఒక మీడియా నివేదించింది. ఇటీవల కాలంలో అమెజాన్ కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టాయని, ఈ క్రమంలోనే ఉద్యోగుల తీసివేతకు సంస్థ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఫెస్టివల్ సీజన్‌లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగేదని, అయితే ఈసారి సేల్స్‌లో పెద్దగా పురోగతి కనబడలేదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ యాజమాన్యం ఆలోచనలో పడింది. కంపెనీలోని లాభదాయకం కాని పలు విభాగాలను గుర్తించి, అందులోని ఉద్యోగులను ఇప్పటికే అలర్ట్ చేసింది.
కంపెనీలోనే ఇతర విభాగాలలో అవకాశాలు వెతుక్కోవాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలను కూడా కొంత కాలంగా ఆపేసింది. వేర్ హౌస్‌ల నిర్మాణాన్ని కూడా వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఇదంతా కంపెనీ ఖర్చులు తగ్గించడానికేనని కంపెనీ వర్గాలు అంటున్నాయి. అమెజాన్ ప్రతి సంవత్సరం.. అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంది. దాదాపు 16 లక్షల మంది ప్రతీ సంవత్సరం అమెజాన్‌లో చేరుతుంటారు. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టారని, దాని ఫలితంగానే ఈసారి ఆశించినంతగా సేల్స్ జరగలేదని అమెజాన్ చెబుతోంది.
ఈ కారణంగానే ఉద్యోగులను అమెజాన్ తీసివేయాలనుకుంటోంది. అయితే మొత్తం తొలగింపుల సంఖ్య ఇంకా నిర్ణయించబడలేదు. 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తారని అంచనా మాత్రమే. ఇటీవల ట్విట్టర్, మెటా సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఉద్యోగులను తీసేశాయి. ట్విటర్‌లో సగానికిపైగా ఉద్యోగులు తొలగించబడగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా గత వారం 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, బైజూస్, ఓలా, అనాకాడెమీతో సహా అనేక భారతీయ స్టార్టప్‌లు నిధులు, పెట్టుబడులలో క్షీణత నేపథ్యంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి.