తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగులను కరోనా మహమ్మారి కలవరపెడుతూ ఉంది. ఎంతో మంది బ్యాంకింగ్ రంగానికి చెందిన ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగుల్లో ఏకంగా 600 మంది కరోనా పాజిటివ్ గా తేలడంతో తెలంగాణలోని బ్యాంకింగ్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.

తెలంగాణ రాష్ట్రంలో 600 మంది భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులు కొవిడ్-19 బారినపడుతున్నారని.. వైరస్ బారిన మరింతమంది ఉద్యోగులు పడకుండా చర్యలు చేపట్టామని అన్నారు. 30వ తేదీ వరకు బ్యాంకులో సగం మంది ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని కూడా తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలను తగ్గించాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) నిర్ణయించింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవల్ని పరిమితం చేయాలని ఎస్ఎల్‌బీసీ భావిస్తోంది. బ్యాంకుల్లో సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. మే 15వ తేదీ వరకు బ్యాంకు వేళలను కుదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలుస్తోంది. అనుమతి వస్తే కొత్త పనివేళలు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తాయి. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని చెబుతూ ఉన్నారు. బ్యాంకు పనివేళలను కనుక తగ్గిస్తే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్ల సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్ఎల్‌బీసీ బ్యాంకర్లను ఆదేశించింది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story