ఉద్యోగులకు శుభవార్త.. వారానికి నాలుగు రోజులే పని.. పుల్ శాలరీ
100 Companies In UK Switch To Four-Day Working Week With No Pay Cut.వారానికి నాలుగు రోజులే పని.
By తోట వంశీ కుమార్ Published on 29 Nov 2022 7:41 AM GMTవారానికి నాలుగు రోజులే పని. మిగతా మూడు రోజులు సెలవులే. అలా అని ఇచ్చే జీతంలో ఏమీ కోత విధించరు. ఎక్కువ గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇది అన్ని చోట్ల కాదులెండి. యునైటెడ్ కింగ్ డమ్‌లోని ఓ 100 కంపెనీల్లో అమలు అవుతోంది. ఈ విధానం మంచి ఫలితాలను అందించడంతో ఇక పై శాశ్వతంగా ఆ కంపెనీలో ఇదే పని విధానాన్ని కొనసాగిస్తామని తెలిపాయి. ఈ కంపెనీల్లో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఈ విధానం వల్ల ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, ఉత్పాదకత విషయంలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నాయి. ఉద్యోగుల వలసలను సైతం ఇది అడ్డుకుంటుందని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న పెద్ద కంపెనీల్లో 'అటమ్ బ్యాంక్', గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ 'అవిన్' సైతం ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఒక్కోదాంట్లో 450 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.
నాలుగు రోజుల పని విధానంపై అవిన్ సీఈవో ఆడమ్ రాస్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంగా దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానంలో ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. కస్టమర్లతో సంబధాలు కూడా మెరుగైనట్లు తాము గమనించామన్నారు. నిపుణులైన ఉద్యోగులు సంస్థలోనే కొనసాగుతున్నారని, ఉద్యోగుల వలసలను ఇది అడ్డుకుంటుందని చెప్పారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదని తెలిపారు.
ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల పని విధానంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కంపెనీల్లో పైలట్ ప్రాతిపదికన అధ్యయనం జరుగుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిలకు చెందిన పరిశోధకులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు.