Budget 2024: త్వరలో బడ్జెట్.. నిరుద్యోగులకు కేంద్రం పెద్దపీట వేయబోతోందా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024వ తేదీ నాడు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 29 Jan 2024 10:00 AM IST
Budget 2024: త్వరలో బడ్జెట్.. నిరుద్యోగులకు కేంద్రం పెద్దపీట వేయబోతోందా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024వ తేదీ నాడు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి కేంద్రం పెద్ద పీట వేయబోతోందని బడ్జెట్ నిపుణులు చర్చించుకుంటున్నారు. వీటితో పాటు ఉపాధి కల్పించే స్కీంలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం.
ఉద్యోగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం వచ్చే రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏకంగా రూ.6000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కాగా ఈ స్కీం కింద 5 లక్షలకుపైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. సుమారు 10 లక్షల ఉద్యోగాలను కల్పించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాయీ కంపెనీలు. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని పెంపొందించడానికి స్వావలంబన భారత ఉపాధి పథకం ప్రవేశపెట్టారు. ఇది భారత్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చేసేందుకు తీసుకురాబడింది.
అలాగే తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధిని కల్పించడానికి, ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళల వంటి రంగాలను మరింత విస్తరించవచ్చని సమాచారం. ఇందులో సరైన ఉపాధి లభిస్తే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్పొరేట్‌లకు కొత్త తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన 15 శాతం ఆదాయపు పన్ను రేటును ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చని పేర్కొంటున్నారు.