Budget 2024: దేశ చరిత్రలో కీలకమైన బడ్జెట్ వివరాలు ఇవే
ఫిబ్రవరి 1 సమీపిస్తున్న కొద్దీ కేంద్ర 2024 బడ్జెట్‌కి సంబంధించిన చర్చలు పెరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి ప్రకటనలు రానున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.
By అంజి Published on 29 Jan 2024 6:32 AM GMTBudget 2024: దేశ చరిత్రలో కీలకమైన బడ్జెట్ వివరాలు ఇవే
ఫిబ్రవరి 1 సమీపిస్తున్న కొద్దీ కేంద్ర 2024 బడ్జెట్‌కి సంబంధించిన చర్చలు పెరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి ప్రకటనలు రానున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. అయితే ఈ బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో లేదు. మరి దానికి ఈ పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
బడ్జెట్.. బౌజ్
బడ్జెట్ అనే పదం 'బౌజ్' అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. బౌజ్ అంటే చిన్న సంచి అని అర్థం. నిజానికి ఈ బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112లో 'వార్షిక ఆర్థిక ప్రకటన' అనే పదాన్ని ఉపయోగించారు. ఈ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ప్రభుత్వ అంచనా వ్యయం, రాబడి గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తుంది.
బడ్జెట్ వెనుకున్న కథ..
నిజానికి బడ్జెట్ అనే పదం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 1733లో ఇంగ్లండ్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెర్.. సర్ రాబర్ట్ వాల్‌పోల్ కొన్ని పత్రాలతో కూడిన చిన్న సంచితో పార్లమెంటుకు వచ్చారట. ఆ బ్యాగ్ ఏంటని ప్రశ్నించగా.. అందులో అందరి బడ్జెట్ ఉందన్నారు. ఇక అప్పటి నుంచి బడ్జెట్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.
భారత దేశ చరిత్రలో కీలకమైన బడ్జెట్‌ల వివరాలు
భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను బ్రిటిష్‌రాణికి సమర్పించారు. స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబర్ 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఎవరెవరు ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే..
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1962 - 69 మధ్య 10 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాల్లో ఆయన పుట్టినరోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్‌లు ఇవే..
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థికమంత్రి హీరూభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతి చిన్నది. ఆ బడ్జెట్‌లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. 4
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళలు ఎవరంటే?
ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970 -71లో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ - ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది. 2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారిగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు.