చంద్రబాబుకు భద్రత తగ్గించారు.. కేంద్ర హోంశాఖకు బుద్దా వెంకన్న లేఖ

By అంజి  Published on  7 March 2020 12:50 PM GMT
చంద్రబాబుకు భద్రత తగ్గించారు.. కేంద్ర హోంశాఖకు బుద్దా వెంకన్న లేఖ

అమరావతి: రాష్ట్రంలో ప్రతి పక్ష నేతలకు భద్రత లేకుండా పోతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు.. టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలకు భద్రతా సిబ్బందిని తగ్గించారని బుద్దా తన లేఖలో పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు భద్రతా సిబ్బందిని కుదించారని, అలాగే చంద్రబాబు, లోకేష్‌లు రాష్ట్రంలో పర్యటనలకు వెళ్తే వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బుద్దా వెంకన్న తన లేఖలో చెప్పారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు కూడా అడ్డుకున్నా వారిని నిరోధించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబుకే ఈ పరిస్థితి ఉంటే.. రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్ష నేతల పరిస్థితి చూడకుండనే చెప్పొచ్చన్నారు. రాష్ట్రంలో వైసీపీ దురాగతాలు అంతులేకుండా పోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

వైసీపీ అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సీఎం జగన్‌కు పటిష్ట చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో అమిత్‌ షాని బుద్దా వెంకన్న కోరారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల భద్రతపై సీఎం జగన్‌కు సూచనలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it