ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్‌

By Newsmeter.Network  Published on  7 April 2020 3:48 AM GMT
ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ వైరస్‌ భారిన పడి లక్షలాది మంది ఆస్పత్రుల పాలవుతుండగా, వేలాది మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అన్ని దేశాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను వదలలేదు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయనలో ఇంకా కొన్ని వైరస్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రధాని శరీరంలో వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు. దీంతో బ్రిటన్‌ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ సోకి ఐసీయూలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. బోరిస్‌ జాన్సన్‌ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ప్రపంచ దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా ప్రజలంతా బోరిస్‌ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ సైతం బోరిస్‌ ఆరోగ్యంపై వాకబు చేశారు. అతిత్వరలో కోలుకొని విధుల్లో చేరుతారని ఆకాంక్షించారు.

Also Read : మన వైద్యులకు చైనా ‘పీపీఈ’లు

Next Story