హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

By Newsmeter.Network  Published on  7 April 2020 2:16 AM GMT
హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి.. తెలంగాణలోనూ రోజురోజుకు విజృంభిస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తం లాక్‌డౌన్‌ను రాష్ట్రంలోనూ పకడ్బందీగా అమలు చేస్తుంది. ప్రజలెవరూ బయటకు రాకుండా అప్రమత్తం చేస్తూ.. కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. కరోనా అనుమానితులను వెంటనే క్వారంటైన్‌లకు తరలించి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో గత వారం రోజుల వరకు రాష్ట్రంలో అదుపులో ఉన్న వైరస్‌.. ఢిల్లిలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారు రాష్ట్రానికి రావడం, వారిలో వైరస్‌ ఉన్నవారు కొందరు ఉండటం, వారి ద్వారా మరికొందరికి కాంటాక్ట్‌ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యి ఢిల్లి వెళ్లొచ్చిన వారిని క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించింది. తద్వారా కాంటాక్ట్‌ కేసులు పెరగకుండా చర్యలు వేగవంతం చేసింది.

Also Read :లాక్‌డౌన్‌ పొడగింపా? ఆంక్షలా?.. 9 తరువాత స్పష్టత వచ్చే అవకాశం..

రాష్ట్రంలో కాంటాక్ట్‌ కేసులు పెరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాల నుండి ప్రజలెవరూ మిగతా ప్రాంతాలకు వెళ్లకుండా, రాకపోకలు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికితోడు ఆయా ప్రాంతాల్లోని వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతుంది. ఈ బాధ్యతను పోలీసులపై పెట్టినట్లు తెలుస్తోంది. దీనిద్వారా కాంటాక్ట్‌ కేసులు పెరగకుండా ఉంటాయని, తద్వారా కరోనా వ్యాప్తికి అడ్డకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :బిగ్‌బ్రేకింగ్‌: లాక్‌డౌన్‌ పొడిగించాల్సిందే: సీఎం కేసీఆర్‌

ఇటీవల కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన వారి ద్వారా ఒకేసారి పదికేసులు బయటపడ్డ సంగతి విధితమే. వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి.. వారు తిరిగిన ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘాపెట్టి ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంతో కరీంనగర్‌లో కాంటాక్ట్‌ కేసులు తగ్గిపోయాయి. ఇదే విధానాన్ని హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తి నిలిచిపోతుందని, తద్వారా కరోనాను రాష్ట్రంలో ఉధృతం కాకుండా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్న ప్రభుత్వం ఆమేరకు చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తుంది.

Next Story