ప్రియురాలి చితిలో పడి యువకుడు ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2020 12:31 PM ISTతండ్రి సెల్‌ఫోన్ కొనలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. తన ప్రేయసి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు ఆమె చితిపై పడి సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ఉళుందూర్‌పేట సమీపం మేట్టునన్నావరం గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి నిత్యశ్రీ(19) నివసిస్తోంది. ఆమె నర్సింగ్ చదువుతోంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు కాలేజీలు, పాఠశాలలు తెరవకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా.. నిత్యశ్రీ, ఆమె ఇద్దరి సోదరిలు ఒకే సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఈ విషయంలో వార మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తనకు ఓ సెల్‌ఫోన్ ను కొని ఇవ్వమని నిత్యశ్రీ తన తండ్రిని అడిగింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున నిత్యశ్రీ తండ్రి ఆమెకు ఫోన్ కొనివ్వలేకపోయాడు. మనస్తాపానికి గురైన నిత్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా.. నిత్యశ్రీ మరణ వార్త విన్న రాము దాన్ని తట్టుకోలేకపోయాడు. తాను కూడా చనిపోవాలనుకున్నాడు. నిత్య అంత్యక్రియలు జరుగుతున్న స్మశాన వాటికకు చేరుకున్నాడు. శ్మశానంలో ఆమె చితిని వెలిగించగానే.. రాము కూడా దానిపై పడి ఆత్మాహుతి చేసుకుని మరణించాడు. అనుకోని ఈ ఘటన చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
జిల్లా ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు శ్మశానానికి వెళ్లి నిత్యశ్రీని దహనం చేసిన చోట బూడిదను పరిశీలించగా ఒక వాచ్, సెల్‌ఫోన్ విడిభాగాలు దొరికాయి. ఎముకలను పరిశోధన కోసం ఫోరెన్సిక్ నిపుణులు తీసుకెళ్లారు. ఉళుందూర్‌పేట డీఎస్పీ విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నిత్యశ్రీ శవం కాలుతున్న మంటల్లో ఒక యువకుడు కూడా దహనమైనట్లు తెలుస్తోందని అన్నారు. అదేరోజున రాము కనిపించకుండా పోవడం.. శ్మశాన పరిసరాల్లో సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఫోరెన్సిక్ పరిశోధనల ఫలితాలు వచ్చిన తరువాతనే రాము గురించి నిర్ధారించగలమని అన్నారు.