139 మంది అత్యాచారం కేసులో ట్విస్ట్..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sep 2020 12:27 AM GMT
తనపై 139 మంది అత్యాచారం చేశారని ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా.. తాజాగా ఈ కేసులో ఓ ట్విస్టు వెలుగుచూసింది. ఈ వ్యవహారం వెనుక డాలర్ భాయ్ అనే వ్యక్తి ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు బాధితురాలు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి కొన్ని కీలక విషయాలు వెల్లడించింది.
139 మంది తనను రేప్ చేయలేదని, తన ఫ్యామిలీని అంతమొందిస్తానని డాలర్ బాయ్ బెదిరించి కేసును తప్పుదోవ పట్టించాడని బాధితురాలు పేర్కొంది. డాలర్ బాయ్ ఒత్తిడి వల్లేనే కేసులో యాంకర్ ప్రదీప్ పేరు చేర్చినట్లు తెలిపింది. నటుడు కృష్ణుడుకి కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు తెలిపింది. తనపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే.. అది సెలబ్రెటీలు కాదని బాధితురాలు పేర్కొంది. సెలబ్రెటీలు తన వల్ల ఇబ్బందులు పడ్డారని.. వారికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది.
'డాలర్ భాయ్.. నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాలో రాత్రిపూట చెప్పేవాడు. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించారు. 139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు. నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్ భాయ్ చెప్పినట్లే చేశాను. డాలర్ భాయ్ నాపట్ల అమానుషంగా వ్యవహరించాడు. నాకు జరిగిన అన్యాయం, మరెవరికీ జరగకూడదు. చెప్పినట్లు చేయకపోతే కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడు. డాలర్ భాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చాల్సి వచ్చింది. అంతేకాదు నటుడు కృష్ణుడికి కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నన్ను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్‌లో మాట్లాడించారు. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లు చేర్చారు' అని బాధితురాలు చెప్పింది.