తెలంగాణ పోలీసుల ఖాతాలో మరో రికార్డు..ఐదేళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

By సుభాష్  Published on  10 Oct 2020 10:59 AM IST
తెలంగాణ పోలీసుల ఖాతాలో మరో రికార్డు..ఐదేళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి ఏళ్లపాటు కనిపించకుండా తప్పిపోతే వారి బాధ వర్ణానాతీతం. తప్పిపోయిన పిల్లలు కనిపించకపోతే .. ఎలా ఉన్నారో.. ఎక్కడున్నారో.. ఏం తింటున్నారో అన్న బాధ ప్రతినిత్యం వేధిస్తూ ఉంటుంది. అలాంటిది ఐదేళ్ల కిందట తప్పిపోయిన కొడుకు గురించి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు ఎలాంటివే చెప్పనక్కలేదు. ఐదేళ్ల కిందట తప్పిపోయిన కొడుకును ఎలా మార్చిపోగలరు. ఐదేళ్ల దుఖాఃనికి ఆనంద బాష్పాలు వచ్చేలా చేశారు తెలంగాణ పోలీసులు. దీంతో తెలంగాణ పోలీసుల ఖాతాలో మరో రికార్డు నమోదైంది. టెక్నాలజీ సాయంతో ఐదేళ్ల కిందట తప్పిపోయిన బాలున్ని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులు ఓ తల్లి ఆవేదనను తీర్చారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ దంపతుల కుమారుడు 2015లో అలహాబాద్‌లో తప్పిపోయాడు. అయితే కుమారుడు తప్పిపోయిన విషయాన్ని అప్పట్లో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడాది పాటు గాలించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇక పోలీసులు, తల్లిదండ్రులు ఎన్నో ప్రాంతాల్లో వెతికినా లాభం లేకుండా పోవడంతో చివరకు చేసేదేమిలేక అలాగే ఉండిపోయారు. చివరకు ఆ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ కేసు మిస్సింగ్‌ కేసుగానే ఉండిపోయింది. తల్లిదండ్రులు కూడా తప్పిపోయిన కొడుకు ఇన్నేళ్లయినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో అసలు అన్నాడో.. లేడో.. అని బాలుడి ఆచూకీ కోసం వెతకడం మానేశారు.

ఇక తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం టెక్నాలజీతో తమ వద్ద ఉన్న బాలుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడుగా గుర్తించి అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఒక్కసారిగా కొడుకు తల్లిదండ్రుల కళ్ల ముందు కనిపించడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి రోధనను చూసి పరిసర ప్రాంతాల వాసులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఐదేళ్ల కిందట తప్పిపోయిన బాలుడిని చూసి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి చేరదీసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు తెలంగాణ పోలీసులు.



Next Story