బీజేపీ వేసిన సీఏఏ ట్రాప్‌లో పడ్డ విపక్షాలు

By Newsmeter.Network  Published on  30 Dec 2019 3:41 AM GMT
బీజేపీ వేసిన సీఏఏ ట్రాప్‌లో పడ్డ విపక్షాలు

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం విషయంలో విపక్షాలు వ్యూహం లేకుండానే బరిలోకి దూకాయా? బిల్లు చట్టంగా మారిన తరువాత వామపక్ష భావాలున్న విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, ముస్లింలు ఉద్యమం ప్రారంభించారు. మరుసటి రోజుకి విపక్షాలు -ముఖ్యంగా- కాంగ్రెస్ గొంతు కలిపాయి. రెండు మూడు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉద్యమం విస్తరించింది. మీడియా సహజంగానే దీనికి వీలైనంత ప్రాచుర్యం కల్పించింది. టీవీ చాట్ షోలలో చర్చలు మొదలయ్యాయి. మొత్తం మీద మోదీ ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేయడానికి మంచి ఇష్యూ దొరికిందనిపించింది.

కానీ ఇప్పుడు ఉద్యమాలు నెమ్మదిగా చప్ప బడుతున్నాయి. పెద్దగా జనం రోడ్ల మీదకి రావడం లేదు. అంతే కాదు. అక్కడక్కడా అరా కొరా నిరసనలు జరిగినా అందులో జనం బాగా పలచబడ్డారు. దీంతో పత్రికలు వారిని పట్టించుకోవడం మానేశాయి. అప్పటి వరకూ ఆగిన బిజెపి-ఆరెస్సెస్ ప్రచార రథాలు ఒక్కసారిగా బయటకి వచ్చాయి. బిజెపి ఆధ్వర్యంలోనూ పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా పెద్ద పెద్ద ర్యాలీలు మొదలయ్యాయి. వీటిలో జనం ఇంకా ఎక్కువగా పాల్గొన్నారు. మీడియా వీటికి కూడా ప్రాచుర్యం కల్పించింది. ఫలితంగా ఇప్పుడు ఒక సీఏఏ వ్యతిరేక ర్యాలీ వార్త వస్తే రెండో వైపు ఒక అనుకూల వార్త వస్తోంది.

ఈ సమయంలోనే బీజేపీ దేశ వ్యాప్తంగా తన మంత్రులను, నేతలను, వక్తలను రంగంలోకి దింపింది. దాని అనుకూల సంస్థలైన ఏబీవీపీ, బీఎంఎస్, ఆరెస్సెస్ వంటి సంస్థలు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ కార్యకర్తలు ఒక పదిహేను రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి, కరపత్రాలు పంచి, సీఏఏ గురించి తెలియచేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఇంటింటి ప్రచారోద్యమంలో కాంగ్రెస్, తదితర విపక్షాలను విలన్లుగా చూపించే ప్రయత్నమూ చేస్తారు. ఈ హోరులో మోదీకి కాసింత వ్యతిరేకమైన ప్రజలు అనుకూలులుగా మారతారు. మొత్తం మీద జనవరి నెలాఖరు వరకూ ఈ ఉద్యమం నడుస్తుంది. ప్రజలు సీఏఏ వ్యతిరేకులను మరిచిపోతారు. తమ మాటే నిలుస్తుందన్నదే బీజేపీ అంచనా.

మొత్తం మీద కాంగ్రెస్, తదితర పార్టీలు వంద మీటర్ల పరుగుపందెం ఆటగాళ్లలా హడావిడి పడి అలసిపోతే, బిజెపి మాత్రం లాంగ్ డిస్టెన్స్ రన్నర్ లా ఓపిగ్గా వ్యూహాలు పన్నుతోంది. పైగా విపక్షాల ఉద్యమాలు హింసాత్మకంగా జరిగితే, తమ ఉద్యమాలు శాంతియుతంగా, ఎవరికీ ఏ ఇబ్బందీ జరగకుండా నిర్వహిస్తున్నట్టు కూడా బిజెపి ప్రజలకు చెప్పబోతోంది. మొత్తం మీద సీ ఏ ఏ ఆటను తమకు అనుకూలంగా మలచడంలో, విపక్షాలను తమ ట్రాప్ లో పారేయడంలో బిజెపి విజయం సాధిస్తున్నట్టే కనిపిస్తోంది.

అంతెందుకు.... గత పదిహేను రోజులుగా ప్రజలు ఉల్లి ధర, పెట్రో మంట, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి అంశాల గురించి ఆలోచిస్తున్నారా? వారందరూ సీ ఏ ఏ గురించే ఆలోచిస్తున్నారు. అదే ఇప్పుడు చర్చా విషయం. ఇలా అసలు విషయాల నుంచి దృష్టి మరలించడానికి బిజెపికి సహాయపడిందెవరు? విపక్షాలు కాదా?

Next Story