మజ్లిస్ కోసమే జర్నలిస్టులపై కేసులు..

By అంజి  Published on  2 Feb 2020 7:55 PM IST
మజ్లిస్ కోసమే జర్నలిస్టులపై కేసులు..

ముఖ్యాంశాలు

  • భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు తగదు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

ఢిల్లీ: ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను టీఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం సరికాదని ఆయన అన్నారు.

నిర్మల్ జిల్లా బైంసాలో ఎంఐఎం అండతో ఓ వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వారిపై జరిపిన దాడుల్లో బాధితుల ఆవేదనను.. బయట ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు సిద్దుపై.. పోలీసులు కేసులు పెట్టడం అక్రమమని తెలిపారు. జర్నలిస్టు సిద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన వైఖరిని.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిద్దుకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ సర్కారు కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. ఎంఐఎం సూచనల మేరకే.. అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భైంసాలో దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా.. అమాయక యువకులను అరెస్టు చేశారని తెలిపారు. గతంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్.. మీడియా సంస్థలపై ఆంక్షలు విధించిన తీరు దారుణమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూడా అదే విధానాలు అనుసరిస్తూ.. జర్నలిస్టులపై నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదనే విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం గౌరవిస్తోందని అన్నారు. భైంసాలో దాడులు జరిగిన తీరును, బాధితుల ఆవేదన ప్రసారం చేసిన జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను తెలంగాణ డీజీపీతో మాట్లాడతానని కిషన్‌రెడ్డి తెలిపారు.

Next Story