అలా ముందుకెళ్తామంటున్న 'కాషాయపవనాలు'
By Newsmeter.Network
అమరావతి: రాష్ట్రంలోని బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని నెలకొన్న సమస్యలపై కలిసిపోరాడతమని, జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటేనన్నారు. ఏపీ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామని పవన్ వివరించారు. స్ధానిక, సార్వత్రిక ఎన్నికల్లోనే కలిసి పోటీ చేస్తామన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్రానికి లాభమన్నారు. కులతత్వంకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని, టీడీపీ ప్రభుత్వ అవకతవకలు ప్రజలను ఇబ్బందులకు గురిపెట్టాయని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంత పెద్ద రాజధాని ఇంత తక్కువ సమయంలో కట్టడం సాధ్యం కాదని తాను ఆనాడే భయం వ్యక్తం చేశానని, ఇప్పుడు నా భయాన్ని వైసీపీ నిజం చేసిందన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం అన్ కండీషనల్‌గా కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. ఇరుపార్టీల మధ్య ఎటువంటి సమాచార లోపం లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. ప్రతి మూడువారాలకు ఓ సారి కలిసి మాట్లాడుకుంటాము.. అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన ప్రభుత్వంను స్థాపించడమే లక్ష్యమన్నారు. పాలెగాళ్ల ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారు.. గత ప్రభుత్వంను ఆదరించే స్థితిలో లేరు.. ప్రత్యామ్నయం అవసరమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు పరస్పరం కలిసి అనుసంధానం కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలోని సామాజిక న్యాయం బీజేపీ-జనసేనతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ బీజేపీ కలిసి పనిచేయడానికి వచ్చారని కన్నా తెలిపారు. జనసేన తమతో కలిసి పనిచేయడాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామన్నారు.
కేంద్రంతో తాము దగ్గరగా ఉన్నామని అన్ని పార్టీలు చెబుతున్నాయి.. అవన్ని అవాస్తవాలని, జనసేన మాత్రమే బీజేపీతో కలిసి పనిచేయనుందని జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఏపీలో కూడా త్వరలో అద్భుత రాజకీయ ఫలితాలు సాధిస్తామన్నారు. బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు స్వాగతిస్తారని, కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తామన్నారు. బీజేపీ జనసేన ఉత్సాహంతో ప్రజా క్షేత్రంలో దిగి మంచి ఫలితాలు సాధిస్తుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు.