తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మెల్ల‌మెల్ల‌గా రాజుకుంటోంది. ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాల‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ…తాజాగా మ‌హారాష్ట్ర‌లో కూడా త‌మ ప‌ట్టు సాధించింది. రాత్రికి రాత్రే చ‌క్రం తిప్పి స‌త్తా చాటుకుంది. ఇక తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఎలా దెబ్బకొట్టాలి? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలా అధికారంలోకి రావాలి…? అనేది ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నేతల్లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసైను తెలంగాణ గవర్నర్ గా తీసుకొచ్చిన బీజేపీ…కేసీఆర్ నెత్తిన కూర్చోబెట్టింది. ఇప్పటికే ఆమె తెలంగాణ సీఎంను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తురనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఇప్ప‌టి నుంచే పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ సమ్మె వెనుక కూడా బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అందుకే కేసీఆర్ ఈ సమ్మె విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారని, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పంథాను నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారనే టాక్ బలంగావినబడుతోంది. ఇక హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ లో బలపడాలని యోచించిన బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. కనీసం డిపాజిట్ కూడా ఇవ్వకుండా ఘోర ఓటమిని ఇచ్చారు. దీంతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారం చేపట్టాలనే ఆశతో కేంద్ర హోంమంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నో ప్లాన్లు చేశారు. అన్ని ఒడిదొడుకులను తట్టుకొని నిలబడుతున్న కేసీఆర్ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి బీజేపీ రెడీ అయ్యిందన్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో గుప్పుమంటోంది. తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వచ్చేందుకు దాదాపు ఇంకా నాలుగేళ్ల వరకు సమయం ఉన్నా… కమల దళం ఇప్పటి నుంచి ఎత్తులుపై ఎత్తులు వేస్తోంది. సో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులను ఉద్యమసేనాని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్