ఎవరీ బిర్రు ప్రతాప్‌రెడ్డి.. జగన్‌ సన్నిహితుడా..? చంద్రబాబు అనుచరుడా..?

By అంజి  Published on  4 March 2020 7:35 AM GMT
ఎవరీ బిర్రు ప్రతాప్‌రెడ్డి.. జగన్‌ సన్నిహితుడా..? చంద్రబాబు అనుచరుడా..?

అమరావతి: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుకు కారణం మీరంటే.. మీరని.. అధికార, ప్రతిపక్షాలు తెగ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించింది. అయితే 50 శాతనికి మించి రిజర్వేషన్లు పెంచడం సరికాదని బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ కూడా చేపట్టింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నెలఖారులోపు బీసీల రిజర్వేషన్లను తేల్చాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇక్కడ పిటిషన్‌ వేసిన వ్యక్తి టీడీపీ సానుభూతి పరుడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు రిజర్వేషన్లపై కేసులు వేసింది జగన్‌ మనుషులేనని టీడీపీ నేత చంద్రబాబు అంటున్నారు. వీరి పోరులో బీసీలు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బీసీల మీద కక్షతోనే టీడీపీ నేతలు.. రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బీసీలను వ్యూహాత్మకంగా వంచించారని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది. కోర్టులో కేసులు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్న బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు వైసీపీ చెందిన వారు కాద అంటూ టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ప్రశ్నించారు. అయితే అధికార, ప్రతిపక్షాలు.. కోర్టును ఆశ్రయించిన వ్యక్తులు తమ పార్టీ కాదంటే.. తమ పార్టీ కాదని బీసీల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తిని 2019 మార్చి 9వ తేదీన చంద్రబాబు ప్రభత్వం ఉపాధిహామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఏపీపీసీలో బిర్రు ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు వ్యక్తిగత లాయర్‌ ప్రణతి.. హైకోర్టులో రిజర్వేషన్ల అంశంపై బిర్రు ప్రతాప్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించింది.

స్థానిక సంస్థ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టులో సవాల్‌ చేసింది వైసీపీ మనుషులేనని చంద్రబాబు అంటున్నారు. ఇక బోయ రామాంజనేయులు వైసీపీ రాప్తాడు కన్వీనరని, బిర్రు ప్రతాప్‌రెడ్డి సీఎం జగన్‌, మంత్రి బొత్సల సన్నిహితుడే అని చంద్రబాబు చెబుతున్నారు.

Next Story
Share it