Fact Check : ఆ పక్షి ఏకంగా షార్క్ నే ఎత్తుకుని వెళ్ళిపోతోందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 July 2020 7:41 AM GMT
సామాజిక మాధ్యమాల్లో మన ఊహకు కూడా అందని కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఓ వీడియో అలాంటిదే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో వైరల్ అవుతోంది. బీచ్ దగ్గర ఎగురుతున్న ఓ పక్షి కాళ్ళను చూడగా అది ఓ చేపను ఎత్తుకుని వెళ్లడం గమనించవచ్చు. అదొక షార్క్ చేప అని చెబుతూ ఉన్నారు.
“A bird carrying a shark. Where you sit on the food chain isn’t always obvious – a clear warning to the present administration on how quickly you can be voted out. (Sic)” అంటూ ట్విట్టర్ లో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
పక్షులు ఏకంగా షార్క్ నే ఎత్తుకుని వెళుతున్నాయంటే భవిష్యత్తులో ఏదో జరగబోతోంది అంటూ చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఈ వీడియోను అమెరికా జట్టు మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్ మన్ కూడా ఈ వీడియోను ట్వీట్ చేయడంతో అది మరి కొంత మందికి చేరింది. The Indian Expressలో ఆర్టికల్ కూడా ప్రచురితమైంది.
ఫేస్ బుక్ లో కూడా పలు పేజీలు ఈ వీడియోను పోస్టు చేశాయి.
నిజ నిర్ధారణ:
వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకొని సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించిన వార్తను ABC news జులై 3న ప్రచురించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని మైర్టిల్ బీచ్(Myrtle Beach) లో చోటుచేసుకుంది. ఆర్టికల్ ప్రకారం ఈ వీడియోలో ఉన్న పక్షి ఆస్ప్రే. వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎడ్ పియోత్రోవ్స్కీ మాట్లాడుతూ ఆ పక్షి పట్టుకున్న చేప పెద్దదిగా ఉండడం మీరు గమనించవచ్చు. అది షార్క్ కాదని స్పానిష్ మాకెరెల్ చేప అని తెలిపాడు. ఆస్ప్రే పక్షులు సాధారణంగా వాటిని వేటాడుతూ ఉంటాయని తెలిపారు.
టెనెసీస్ కు చెందిన ఆష్లే వైట్ తన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ 17వ అంతస్థు నుండి ఈ వీడియోను తీసింది. జూన్ 22వ తేదీన ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
ఆస్ప్రే పక్షులు బాగా పెద్దవిగా ఉంటాయి. పొడవాటి కాళ్లు ఉంటాయి. లోతు లేని ప్రాంతాల్లోకి వచ్చిన చేపలను ఆకాశంలో నుండే పసిగట్టి వాటిని పట్టుకుంటాయి. స్పానిష్ మాకెరెల్ చెప్పాను ఈ వీడియోలో ఆస్ప్రే పక్షి వేటాడి ఆరగించడానికి తీసుకుని వెళుతోంది. స్పానిష్ మాకెరెల్ సాధారణంగా సముద్రంలో దొరికే చేపల్లో ఇవి కూడా ఒకటి. 13 పౌండ్ల బరువు వరకూ ఈ చేపలు పెరుగుతూ ఉంటాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా పక్షి తీసుకుని వెళుతోంది షార్క్ చేపను కాదు. సముద్ర జలాల్లో సాధారణంగా దొరికే స్పానిష్ మాకెరెల్ చేప..!