ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం.. అటు వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి దగ్గరకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్న తరుణంలో వైద్యులు మాత్రం నేరుగా వారిదగ్గరే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు కరోనా వైరస్‌ భారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లిలో ఏడుగురు, హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇదిలాఉంటే వైద్యం అందిస్తుండగా ఇటలీలో 42 మంది వైద్యులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. దీంతో పలువురు వైద్యులు భయాందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందించాలంటే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినం.. ఎందుకంటే..?

ఈ నేపథ్యంలో వైద్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా డీఆర్‌డీ వో శాస్త్రవేత్తలు బయో సూట్‌ను తయారు చేశారు. ఈ బయోసూట్‌ తయారీలో డీఆర్‌డీవో సంస్థకు చెందిన అనేక ప్రయోగశాలల పరిశోధకులు ఈ కసరత్తులో పాలు పంచుకున్నారని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్‌ కలిగిన రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి ఇది వ్యక్తిగత రక్షణ సాధనంగా పనికొస్తుందని డీఆర్‌డీవో అధికారులు పేర్కొంటున్నారు. దేశంలో వీటికి ఉన్న గిరాకీ దృష్ట్యా రోజుకు 15వేల సూట్లను తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. తొలుత సీమ్‌ సీలింగ్‌ టేపుల కొరత ఉండటంతో ఈ బయో సూట్‌ ఉత్పత్తికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, జలాంతర్గాముల అవసరాలకు ఉపయోగించే పదార్థం ఆధారంగా ఒక ప్రత్యేక సీలెంట్‌ను డీఆర్‌డీవో రూపొందించి.

Also Read : వాళ్లిద్దరూ మహబూబ్ నగర్ సూపర్ విమెన్..!

డీఆర్‌డీవోలోని వివిధ ప్రయోగశాలల శాస్త్రవేత్తలు జౌళి, కోటింగ్‌, నానో టెక్నాలజీలో తమకున్న అనుభవాన్ని ఉపయోగించి ఈ బయోసూట్‌ను రూపొందించారని, దీన్ని విస్తృతంగా పరీక్షించారని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద ఎత్తున వీటిని తయారు చేసేందుకు పలు పరిశ్రమలతో చర్చలు జరిపామని, వైద్యులు, మెడికోలు, ఫ్రంట్‌ లైన్‌లో ఉండే ఇతర వ్యక్తులకు వీటిని అందిస్తామని తెలిపారు. ఇదిలాఉంటే ఇప్పటికే డీఆర్‌డీవో ల్యాబొరేటరీల్లో రోజుకు 1.5లక్షల లీటర్ల శానిటైజర్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఐదు లేయర్ల ఫేస్‌ మాస్క్‌లను తయారు చేస్తుండగా, దాన్ని 20వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే తాము ఢిల్లి  పోలీసులకు 40వేల మాస్క్‌ లను అందించామని తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్