హైదరాబాద్‌లో విషాదం.. 14 నెలల చిన్నారి మృతి
By అంజి Published on 6 Jan 2020 3:44 PM IST
హైదరాబాద్‌లో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అమ్మ దగ్గర ఆడుకోవాల్సిన ఆ చిన్నారిని అప్పుడే మృత్యువు కబళించింది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్కూటీ ఢీకొని 14 నెలల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్‌కుమార్ తన మేనల్లుడిని ఏత్తుకొని జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా.. మాదాపూర్ వైపు వెళ్తున్న స్కూటీ రాజ్ కుమార్‌ను ఢీకొట్టింది. దీంతో రాజ్ కుమార్ చేతుల నుంచి చిన్నారి సతీష్ జారీ కిందపడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
కళ్లముందే అల్లుడు సతీష్ చనిపోతున్న మేనమామ రాజ్‌కుమార్ ఏం చేయలేకపోయాడు. రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ ప్రమాదంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల తీవ్ర రోదనకు గురవుతున్నారు. ఈ విషాద ఘటన అక్కడున్న అందరినీ కలచివేసింది.