ఇక మూడు నెలలే సమయం

By సుభాష్  Published on  16 Aug 2020 6:49 AM GMT
ఇక మూడు నెలలే సమయం

బీహార్‌ రాష్ట్ర ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ రెడీ అవుతోంది. అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. బీహార్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని పలు పార్టీలు కోరినా.. ఎన్నికల కమిషన్‌ మాత్రం సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం కోవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉండటం, వరదలు వంటి సమస్యలతో బీహార్‌ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ, జేడీయూ మినహా అన్ని పార్టీలు కోరాయి.

నవంబర్‌ 29న బీహార్‌ శాసన సభ కాలపరిమితి ముగుస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి పై ఎన్నికల కమిషన్‌ నిపుణుల నుంచి అభిప్రాయాలను సైతం సేకరించింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికల కమిషన్‌.

ఒక్కో పోలింగ్ కేంద్రంలో తక్కువ సంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంచనున్నారు. పోలింగ్‌ సిబ్బందిని అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చే విషయమై కూడా పరిశీలిస్తోంది ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. ఎన్నికలు నిర్వహించే నాటికి కరోనా వైరస్‌ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది.

అయితే ఎక్కువ మంది ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు కరోనా కారకాలుగా మారే అవకాశం ఉందని, బ్యాలెట్‌ పేపర్లు వినియోగించాలన్న వాదన కూడా ఉంది. అయితే బ్యాలెట్‌ పేపర్లకంటే ఈవీఎంలనే వాడటం మేలంటున్నారు కొందరు. ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ, గ్లౌజులు ధరించి ఈవీఎంలను ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story
Share it