బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2020 11:27 AM GMT
బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ ఎన్నికలను మూడు ద‌శ‌ల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ విష‌యాన్ని సీఈసీ సునిల్ అరోరా ఇవాళ మీడియా తెలిపారు. 243 అసెంబ్లీ స్థానాలుండగా.. అక్టోబ‌ర్ 28వ తేదీన తొలి ద‌శలో 71 స్థానాలకు, న‌వంబ‌ర్ 3వ తేదీన రెండ‌వ ద‌శలో 94 స్థానాలకు‌, న‌వంబ‌ర్ 7వ తేదీన మూడ‌వ ద‌శ‌లో 78 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఎన్నికల సంఘం సుదీర్ఘ సమాచలోచనలు జరిపిందని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. గణాంకాల పరంగా చూస్తే మహమ్మారి విజృంభన సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇదే అతిపెద్దదని తెలిపారు. కరోనా ప్రభావంతో సుమారు 70 దేశాలలో రకరకాల ఎన్నికలను వాయిదా వేశారని ఆయన తెలిపారు. రోజులు గడుస్తున్నా మహమ్మారి విజృంభణ అదుపులోకి వస్తున్న సంకేతాలేవీ కానరాలేదన్నారు. దీంతో ప్రజలకు వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం ఎలాగైనా కల్పించాలని నిర్ణారణకు వచ్చామన్నారు. ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో రద్దీ తగ్గించేలా ఓటింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచామన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటను వేయవచ్చునన్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఈసీ పలు ఆంక్షలు విధించింది. నామినేషన్ దాఖలుకు కేవలం ఇద్దరు మాత్రమే రావాలని, డోర్ టు డోర్ ప్రచారానికి కేవలం అయిదుగురు వ్యక్తులే వెళ్ళాలని ఈసీ నిర్దేశించింది. రోడ్ షోలలో కేవలం అయిదు వాహనాలనే వినియోగించాలని రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలను విడుదల చేశారు.

Next Story