విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 9:37 AM ISTఅమెరికా అధ్యక్ష ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు. బైడెన్ ఇప్పటివరకు 264 ఓట్లు సాధించగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ విజయానికి మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు రావాల్సి ఉన్నది. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అందులో 270 ఓట్లు గెలిచినవారే విజేతగా నిలుస్తారు.
మొత్తం 50 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా, ఇప్పటివరకు 45 రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మరో 5 రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా, అలస్కాలో ఇంకా ఫలితాలు రావాల్సి ఉన్నది. ఇందులో పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కలోలినా, అలస్కాలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, నెవాడాలో బైడెన్ ముందంజలో ఉన్నారు.
బైడెన్ ఖాతాలో రాష్ట్రాలు
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బైడెన్ ఇప్పటికే మిషిగన్ (16), కాలిఫోర్నియా (55), న్యూయార్క్ (29), న్యూజెర్సీ (14), వర్జీనియా (13), వాషింగ్టన్ (12), ఇల్లినోయ్ (20), ఆరిజోనా (11), మసాచుసెట్స్ (11), మిన్నెసొటా (10), మేరీలాండ్ (10), కొలరాడో (9), కనెక్టికట్ (7), ఓరెగన్ (7), న్యూమెక్సికో (5), న్యూహాంప్‌షైర్ (4), రోడ్ ఐలండ్ (4), డీసీ (3), వెర్మాంట్ (3), డెలవెర్ (3), హవాయి (4), విస్కాన్సిన్ (10) రాష్ట్రాల్లో విజయం సాధించారు.
ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు
స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా (20), జార్జియా (16), నార్త్ కరోలినా (15), అలస్కా (3)లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే టెక్సాక్ (38), ఫ్లోరిడా (29), ఒహయో (18), టెన్నెస్సీ (11), ఇండియానా (11), మిస్సోరి (10), అలబామా (9), సౌత్ కరోలినా (9), లూసియానా (8), ఓక్లహామా (7) కెంటకి (8) రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో పడ్డాయి.