కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ సంస్థ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Jun 2020 8:45 AM GMT
కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ సంస్థ

కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని అందరూ భావిస్తూ ఉన్నారు. పలు కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందడుగు వేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో పలు దశలను అధిగమించామని స్పష్టం చేస్తూ అఫీషియల్ గా ప్రకటించింది.

భారత్ బయోటెక్ 'కో వ్యాక్సిన్' పేరుతో ఈ వ్యాక్సిన్ ను తయారుచేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జులై నుంచి మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతులను ఇచ్చింది. మానవ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు వస్తే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరినాటికి భారత్ బయోటెక్ సంస్థ నుంచి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి.

ఈ వ్యాక్సిన్ ను కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీల సహకారంతో తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థకు చెందిన BSL-3 (Bio-Safety Level 3) లో ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు.

కోవిద్-19 కు చికిత్సలో భాగంగా భారత్ కు చెందిన సంస్థ తయారు చేస్తున్న మొదటి వ్యాక్సిన్ ఇదేనని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సి.డి.ఎస్.సి.ఓ.) ఈ ప్రాజెక్ట్ కు అప్రూవల్స్ ఇచ్చిందని ఆయన అన్నారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా తమ సంస్థ ఇచ్చిన రిపోర్టులను చూసి మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతులను ఇచ్చిందని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో AstraZeneca, Moderna Inc సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందు ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. AstraZeneca సంస్థ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ పర్యవేక్షణలో మిడ్-స్టేజ్ హ్యూమన్ ట్రయల్స్ లో ఉంది.

Moderna Inc సంస్థ జులై నెలలో ఫేస్-3 ట్రయల్స్ లోకి ఎంటర్ కాబోతోందట. ఈ సంస్థ mRNA బేస్ చేసుకుని వ్యాక్సిన్ ను తయారు చేయనున్నారు. Pfizer కూడా mRNA వ్యాక్సిన్ ను తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. BNTECH సౌజన్యంతో ఫేస్ 1, ఫేస్ 2 హ్యూమన్ ట్రయల్స్ లో ఉన్నారు. మనుషులపై ట్రయల్స్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అప్రూవ్ తీసుకున్న మొదటి భారత్ కు చెందిన వ్యాక్సిన్ గా COVAXIN నిలిచింది.

ఈ ఏడాది చివరికల్లా కరోనాకు వ్యాక్సిన్ రావచ్చునని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భావిస్తోంది. కోవిద్-19 కు వ్యాక్సిన్ ను తీసుకుని రావడానికి పలు సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయని.. ఇవి ఎంత వరకూ సఫలం అవుతాయో గ్యారెంటీగా చెప్పలేమని డబ్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ వ్యాఖ్యలు చేశారు.

Next Story