భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూశారు. . కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. పది రోజుల క్రితం రాజయ్యకు జ్వరం రావడంతో సొంతూరు సున్నంవారి గూడెంలో చికిత్స అందించారు. అప్పుడు కరోనా టెస్టు చేయగా నెగటివ్ వచ్చింది. పదిరోజులైనా జ్వరం తగ్గకపోవడంతో మళ్లీ సోమవారం భద్రాచలంలోని ఆస్పత్రిలో మరోసారి టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడకు తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004,2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా.. గత కొంత కాలంగా తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారి గూడెంలో రాజయ్య ఉంటున్నారు. కాగా.. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కరోనా సోకింది. వారు రాజమహేంద్రవరం దగ్గర బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

సున్నం రాజయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాజయ్య అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు’ అని సీఎంవో ట్వీట్ చేసింది.

సున్నం రాజయ్య నిబద్ధత కలిగిన వామపక్ష వాది అని సీపీఐ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. రాజయ్య ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.