కరోనా ఎఫెక్ట్ : క్రికెటర్లు చేయకూడని పనులు ఇవే..
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 1:18 PM ISTకరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. భారత్‌లో కూడా 60కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బీసీసీఐ అప్రమత్తమైంది. టీమ్‌ఇండియా క్రికెటర్లకు కరోనా వైరస్ వ్యాప్తించకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కొన్ని జాగ్రత్తలను సూచించింది. ధర్మశాల వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు ముఖ్యంగా ఏడు షరతులు విదించింది. బయట రెస్టారంట్లలోని ఆహారం జోలీకి వెళ్లరాదని, అభిమానులతో కలవరాదని బీసీసీఐ వైద్య సిబ్బంది ఆటగాళ్లకు సూచించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితిని బీసీసీఐ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశాలను ఆటగాళ్లు, జట్టు సహాయ సిబ్బంది, రాష్ట్ర సంఘాలకు వివరించామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పరిశుభ్రంగా లేని, ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లలో భోజనం చేయొద్దు అని వైద్య సిబ్బంది ఆటగాళ్లకు సూచించారు. ఇకపై ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించారు.
జట్టుతో సంబంధం లేని వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దని, అపరిచితులకు షేక్‌హ్యాండ్ ఇవ్వకూదని, అభిమానుల సెల్‌ఫోన్ తీసుకుని సెల్పీలు దిగరాదని స్పష్టం చేశారు. ఇక భారత జట్టు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, బస చేస్తున్నప్పుడు అక్కడి సదుపాయాలను వైద్య సిబ్బంది శానిటైజ్ చేయాలని విమానయాన సంస్థలు, హోటళ్లు, రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ సూచించింది. మార్చి 29 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో కూడా ఆటగాళ్లు, క్రికెట్ సంఘాలు పై నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని బీసీసీఐ ఆదేశించింది.