తొలి వన్డేకి వర్షం అడ్డంకి..! ఆ ముగ్గురు రాణించేనా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2020 4:05 PM GMT
తొలి వన్డేకి వర్షం అడ్డంకి..! ఆ ముగ్గురు రాణించేనా..?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియా రేపు ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు అధికంగా ఉంది. డే/నైట్‌ వన్డేకి వర్షం అడ్డంకి మారనుంది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వాన.. బుధవారం కాస్త తెరిపినిచ్చింది. టీమ్‌ఇండియా ఆటగాళ్ల సాధన అనంతరం మళ్లీ వరుణుడు తన ఆట మొదలుపెట్టాడు. మ్యాచ్‌ జరిగే గురువారం 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. కుండపోతగా వర్షం కురుస్తుండడంతో గ్రౌండ్‌ మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఇదిలా ఉండగా.. గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ బంతి పడకుండానే రద్దైంది. ధర్మశాల స్టేడియం సీటింగ్ సామర్థ్యం 22,000కాగా.. ఇప్పటి వరకూ పావు వంతు టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) వెల్లడించింది.

ఆ ముగ్గురి పైనే కన్ను..

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో బరిలోకి దిగుతున్న భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లపై అభిమానులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్న ఆ ముగ్గురూ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్.

దాదాపు ఆరేళ్ల పాటు టీమ్‌ఇండియా రెగ్యులర్‌ ఓపెనర్‌గా ఉన్నాడు శిఖర్‌ ధావన్‌. ఫామ్‌లేమి, ఫిట్‌నెస్‌ సమస్యలతో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. రాహుల్‌ అతని స్థానంలో పాతుకుపోగా.. పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ లాంటి కుర్రాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధావన్‌ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సిరీస్‌లో గనుక ధావన్‌ విఫలమైతే.. జట్టులో తిరిగి చోటు సంపాదించడం చాలా కష్టం.

గాయం కారణంగా దాదాపు ఏడు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న పాండ్యా రీఎంట్రీలో సత్తాచాటాలని భావిస్తున్నాడు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం నాలుగు నెలలపాటు మైదానంలో అడుగు పెట్టలేదు. తరువాత ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలం కావడంతో జట్టులో చోటుదక్కలేదు. ప్రస్తుతం హార్ధిక్‌ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. డీవైపాటిల్‌ టోర్నీలో మెరుపులు మెరిపించి.. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ పాండ్యా నుంచి ఇవే మెరుపులు ఆశిస్తున్నారు అభిమానులు.

బ్యాటింగ్‌లో ధావన్‌ లాగే బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. హెర్నియా చికిత్స తరువాత కోలుకున్న భువి.. గత ఏడాది ఆగస్టులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ నిరూపించుకుని దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో భువి రాణించడం చాలా కీలకం. అయితే.. భువి ఓ సిరీస్‌లో రాణిస్తే.. మరో సిరీస్‌లో తేలిపోతుంటాడు. ఈ బలహీనతను త్వరగా అదిగమించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సత్తా చాటితేనే అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌ రేసులో ఉంటాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి తడబడుతున్న నేపథ్యంలో భువనేశ్వర్‌ కుమార్‌ పై జట్టు యాజమాన్యం చాలా ఆశలే పెట్టుకుంది.

Next Story