కేంద్రానికి బీసీసీఐ లేఖ.. ఏంరాసిందంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 4:23 PM IST
కేంద్రానికి బీసీసీఐ లేఖ.. ఏంరాసిందంటే..?

ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) వాయిదా వేయడంతో.. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ప్రణాళికలను వేగవంతం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ రద్దు అయితే.. ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలి ఇప్పటికే పలు మార్లు తెలిపాడు. అందుకు తగ్గట్లే సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఐపీఎల్‌ తేదీలు, వేదికలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చుచని సమాచారం.

భారత్‌లో కరోనా మహమ్మారి అధికంగా ఉన్న కారణంగా ఇండియాలో మ్యాచులు నిర్వహించడానికి సాధ్యం కాదని, యూఏఈలో మ్యాచులు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఐపీఎల్ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 'దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున్న ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించామని, సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో లీగ్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామని, విదేశీ గడ్డపై మ్యాచ్‌ల నిర్వహణకు భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని కోరుతుతున్నాం' అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాజాగా ఓ మీడియా సంస్థతో ఐపీఎల్ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ మాట్లాడుతూ.. మరో వారం పది రోజుల్లో ఐపీఎల్‌ పాలకమండలి సమావేశం అవుతుందని, టోర్నీ షెడ్యూల్‌ గురించి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. విదేశాల్లో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి తప్పని సరి కాబట్టి అందుకు అనుమతి కోరామని తెలిపారు. కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014లో తొలిసారి యూఏఈలో ఐపీఎల్‌ సీజన్‌ 7 నిర్వహించిన విషయం తెలిసిందే.

Next Story