బావనక సందీప్‌.. త‌ను గ‌ల్లీ క్రికెట‌ర్ కాదు.. ఇప్పుడు.. ఐపీఎల్ స్టార్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Dec 2019 4:39 AM GMT
బావనక సందీప్‌.. త‌ను గ‌ల్లీ క్రికెట‌ర్ కాదు.. ఇప్పుడు.. ఐపీఎల్ స్టార్..!

బావనక సందీప్‌.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అత‌నో గ‌ల్లీ క్రికెట‌ర్.. రాంనగర్‌ గల్లీల్లో బ్యాట్‌ పట్టుకు తిరిగిన చోటా ఆట‌గాడు త‌ను. అయితే.. నిన్న జ‌రిగిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీకి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. గత సీజన్‌లో హైద‌రాబాద్ నుండి మ‌హ్మ‌ద్ సిరాజ్ ఐపీఎల్ బెర్త్ క‌న్‌ఫ‌ర్మ్ చేసుకోగా.... ఈ సీజన్‌లో సందీప్‌ చోటు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు.

గురువారం జరిగిన ఐపీఎల్‌–2020 వేలంలో సందీప్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. దీంతో రాంనగర్‌లో సంద‌డి మొద‌లైంది. సందీప్‌ 2010లో రంజీ ఆరంగ్రేటం చేశాడు. ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసిన త‌ను.. 75 ఏళ్ల‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

సందీప్ ఇప్ప‌టి వ‌ర‌కూ 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అలాగే.. సందీప్.. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్ కూడా. బీటెక్‌ పూర్తిచేసిన సందీప్ ప్ర‌స్తుతం స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.

సందీప్‌.. ఈ మ‌ధ్య జ‌రిగిన‌ సయ్యద్‌ ముస్తాక్ ఆలీ టోర్నీలో అద్భుతంగా రాణించ‌డంతో ఐపీఎల్ ప్రాంచైజీల దృష్టిలో ప‌డ్డాడు. ఈ టోర్నిలో సందీప్‌.. 7 ఇన్నింగ్స్‌ల‌లో 261 పరుగులు సాధించాడు. అందులో 43 బంతుల్లో 74 పరుగులు (నాటౌట్‌), 31 బంతుల్లో 51 పరుగులు (నాటౌట్‌), 27 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్‌), 16 బంతుల్లో 41 పరుగులు(నాటౌట్‌) చేసి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అంతేకాదు ఈ లీగ్‌లో 15 సిక్సర్లు బాది రెండో స్థానంలో నిలిచాడు.

సందీప్ తండ్రి బావనక పరమేశ్వర్ కూడా క్రికెట‌రే.. బీడీఎల్‌ తరఫున 1978 నుంచి 1990 వరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడారు. ఆ త‌ర్వాత‌ 1990 నుంచి 2000 వరకు హెచ్‌సీఏ తరఫున అంపైర్‌గా విధులు నిర్వ‌ర్తించాడు.

ఆ త‌ర్వాత‌ తన కొడుకును క్రికెటర్‌గా చూడాల‌నుకున్న‌ పరమేశ్వర్‌.. ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్‌లో మెళ‌కువ‌లు నేర్పాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ప్ర‌తీ రోజూ ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో.. తానే గురువుగా క్రికెట్‌లో కొడుకుకు త‌ర్పీదు నిచ్చేవాడు. అయితే, కొడుకును పూర్తిస్థాయి క్రికెటర్‌గా చూడాలను పరమేశ్వర్‌.. తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అదే సందీప్ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దింది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్రాంచైజీకి ఎంపికకావడం ప‌ట్ల సందీప్ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఐపీఎల్ ద్వారా వార్నర్, విలియమ్సన్, వీవీఎస్‌ లక్ష్మణ్ వంటి సీనియ‌ర్ల‌ అనుభవాలను తెలుసుకోవ‌చ్చ‌ని అన్నాడు. ఆల్‌రౌండర్‌ని అయినప్పటికీ ప్రధానంగా బ్యాటింగ్‌ మీదే దృష్టి పెడతాన‌ని.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ–20 టోర్నీలో రాణించ‌డం ద్వారానే ఈ అవకాశం వచ్చిందని అన్నాడు. అంబటి రాయుడు మెళకువలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. సన్‌రైజర్స్‌కు జ‌ట్టుకు ఎంపిక చేసిన లక్ష్మణ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. చిన్న‌త‌నం నుండి క్రికెట్‌లో ఓనమాలు దిద్దించిన‌ నాన్నకు, కోచ్‌ జాన్‌ మనోజ్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటాన‌ని బావోద్వేగంతో అన్నాడు.

Next Story