బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పౌరసత్వ సవరణ చట్టంపై సనా గంగూలీ షేర్ చేసిన పోస్ట్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనబాట పట్టారు. చట్టంపై ప్రభుత్వం వెనకడుగు వేయాల్సిందేనంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సనా షేర్ చేసిన పోస్ట్ ఆమె టైమ్ లైన్ నుంచి తొలగించినప్పటికీ దానిని స్ర్కీన్ షాట్ చేసిన కొంతమంది మాత్రం వైరల్ చేస్తూ..ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

సనా గంగూలీ పోస్ట్ సారాంశం ఏమిటంటే..

నియంతృత్వ ప్రభుత్వాల పాలనపై విఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆమె యథాతథంగా కోట్ చేసింది. 2003లో ప్రచురితమైన దీ ఎండ్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఈ వాక్యాలున్నాయి. దీని సారాంశం ఏమిటంటే..‘‘ప్రతీ నియంత ప్రభుత్వానికి కొన్ని గ్రూపులు, సమూహాలు కావాలి. ఎందుకుంటే వాటిని బూచిగా చూపుతూ భయాందోళనలు పెంచడం వారి నైజం. ఇది ఒక సమూహంతో మొదలు కావొచ్చు.. లేదా రెండు. కానీ అక్కడితో ఆగిపోదు. విద్వేషపు పునాదులపై నిర్మాణమైన ఉద్యమం.. భయాందోళనలు కలిగిస్తూ ఉంటేనే.. ఎక్కువ కాలం మనగలగులుతుంది. ఎవరైతే తాము ముస్లింలు, క్రిస్టియన్లు కావని సంతోషిస్తుంటారో.. వారంతం మూర్ఖుల స్వర్గంలో విహరిస్తున్నవారి కింద లెక్క. వామపక్షవాద రచయితలపై, పశ్చిమదేశాల సంస్కృతిని అనుసరిస్తున్న యువతపై ఇప్పటికే సంఘ్ పరివార్ దృష్టిపెట్టింది. రేపది మహిళలపైకి మళ్లొచ్చు. స్కర్ట్స్ వేసుకునే మహిళలు, మాంసం తినేవారు, మద్యం సేవించే వారు, విదేశీ సినిమాలు చూసేవారు.. ఇలా ఆ జాబితా పెరుగుతూ పోతుండొచ్చు. పళ్లపొడి బదులు పేస్ట్ వాడండి, ఏటా వెళ్లే తీర్థయాత్రలకు వెళ్లడం మానేయండి. జై శ్రీరామ్ బదులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోండి, ఆలింగనాలు చేసుకోండి. అలోపతి మందులను వాడండి. ఇక్కడ ఎవరూ సురక్షితంగా లేరు. ఈ దేశాన్ని సజీవంగా ఉంచాలంటే.. మనం ఖచ్చితంగా మేల్కోవాలి’’ అని రాసి ఉన్న వాక్యాలను సనా గంగూలీ కోట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు పెద్దఎత్తున స్పందించారు.

‘‘కూతురిని దాదా బాగా పెంచాడు.. నేను గంగూలీకి ఫ్యాన్ కాదు.. కానీ ఈ పోస్ట్ చూశాక..ఆయనపై గౌరవం పెరిగింది’’,‘‘తండ్రి మంచి ఆటగాడు.. కూతురు నాగరికత తెలిసిన పౌరురాలు’’, ‘‘బీసీసీఐలో దాదా పని చేస్తున్నారంతే.. ఆయన తన ఆత్మగౌరవాన్ని ఎన్నడూ తాకట్టుపెట్టుకోరు. నాకు నమ్మకం ఉంది. కానీ తన కూతురికి నేర్చించిన విలువలు గొప్పవి’’ సనా గంగూలీ చిన్నతనంలోనే అద్భుతంగా వ్యాఖ్యానించారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే గంగూలీ మాత్రం సనా ఇన్ స్టా పోస్ట్ ఫేక్ అని చెప్తున్నారు. ఆ పోస్ట్ ఆమె పెట్టింది కాదని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సన చాలా చిన్న పిల్ల, ఆమెకు రాజకీయాలు తెలియవు, రాజకీయాల గురించి తెలుసుకునేంత వయసు ఆమెకు లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.