బ్యాంక్‌ల పనివేళల్లో మార్పులు.. గమనించాల్సిన సమయం ఇదే..

By అంజి  Published on  23 March 2020 3:14 PM GMT
బ్యాంక్‌ల పనివేళల్లో మార్పులు.. గమనించాల్సిన సమయం ఇదే..

అమరావతి: కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 31 వరకు బ్యాంక్‌ పనివేళల్లో మార్పు చేసింది. బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. బ్యాంకులన్నీ ఈ నెల 31 వరకు వర్కింగ్‌ డేస్‌లో ఈ పని వేళలు వర్తిస్తాయని చెప్పింది.

ఇక బ్యాంక్‌లో కొత్త అకౌంట్లు ఓపెన్‌ చేయడం, రుణాలు మంజూరు చేయడం వంటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. సిబ్బంది ఎక్కువగా ఉన్న బ్యాంక్‌ల్లో 50 మందితో పని చేయించేలా బ్యాంకర్ల సమితి నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా వ్యాప్తి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా బ్యాంక్‌లను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. బ్యాంక్‌ ఉద్యోగులు అనారోగ్యంగా ఉంటే విధులకు రాకూడదని సూచించింది. అలాగే బ్యాంక్‌లకు వచ్చే కస్టమర్లు గుంపులుగా రావొద్దని తెలిపింది. బ్యాంక్‌ల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచామని పేర్కొంది.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇద్దరు సీఎం లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా ప్రజల తీరులో మార్పు కనిపించలేదు. గుంపులు గుంపులుగా తిరగొద్దని విజ్ఞప్తి చేసినా..తమని కాదన్నట్లే ప్రవర్తించారు. పోలీసులు మైకులు పట్టుకుని రోడ్లపైకి రావొద్దని చెప్పినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాలేదు.

Next Story