మూతపడనున్న దేశంలో అతిపెద్ద కోవిడ్ సెంటర్
By సుభాష్ Published on 8 Sep 2020 2:36 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రత్యేకంగా కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇక దేశంలో కూడా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇక బెంగళూరులో ఏర్పాటైన కోవిడ్ కేర్ సెంటర్ మూతపడనుంది. 10వేల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రాన్ని సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మూసివేయనున్నారు. కేసుల సంఖ్య తగ్గుతుండటం, హోమ్ ఐసోలేషన్‌లో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కోవిడ్ కేంద్రాల్లోచేరే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఈ సెంటర్‌ను మూసివేయనున్నారు.
అయితే ఇది దేశంలోనే అతిపెద్ద సెంటర్. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న బాధితులకు చికిత్స అందించడం కోసం బెంగళూరులోని ఇంటర్‌నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద బెంగళూరు మహానగర పాలక సంస్థ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్ సెంటర్‌లో చేరే వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుండటంతోదీనిపై ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించి సెంటర్‌ను మూసివేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇక కోవిడ కేర్ టాస్క్ ఫోర్స్ చీఫ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పాలక సంస్థ తెలిపింది. ఇందులో పడకలు, ఫ్యాన్లు, డస్ట్‌బిన్లు తదితర వస్తువులను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వసతి గృహాలు, ఆస్పత్రులకు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపింది.