కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందే: WHO

By సుభాష్  Published on  29 Aug 2020 1:50 AM GMT
కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందే: WHO

కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. లక్షణలు లేని వారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అవసరం లేదన్న అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) మార్గదర్శకాలతో డబ్ల్యూహెచ్‌వో విభేదించింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా.. పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా కట్టడిలో అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అభిప్రాయపడింది. వ్యాధిని అడ్డుకోవడానికి ఏకైక మార్గం ఇదొక్కటేనని తెలిపింది. ఎవరికి పరీక్షలు జరపాలన్న విషయంలో ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పాటించవచ్చని సూచించింది.

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు ఖాతరు చేయడం లేదు

కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్‌ దూరం పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. వాతావరణం చల్లబడుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు పెద్దలకు మరింత దగ్గరగా ఉండే అవకాశం ఉందని, ఇది వైరస్‌ వ్యాప్తికి కారణం కావచ్చని హెచ్చరించింది. అయితే వారిని దూరం పెట్టాల్సిన అవసరం లేదని, 6 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.

అమెరికా మార్గదర్శకాలపై విమర్శలు

కాగా, కొవిడ్‌ పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలను అమెరికా తాజాగా మరోసారి సవరించిన విషయం తెలిసిందే. వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష అవసరం లేదని సీడీసీ పేర్కొంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో వైరస్‌ కట్టడిలో విఫలమైన ట్రంప్‌ సర్కార్‌ ఈ మార్గదర్శకాలతో కరోనా పరీక్షల సంఖ్యను తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి. అమెరికా తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పై విధంగా స్పందించింది.

Next Story