బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి... !!!
By సత్య ప్రియ Published on 10 Oct 2019 12:25 PM GMT*బిగ్ బాస్ బ్యాన్ (Ban Bigg Boss) చేయాలంటూ ప్రజా సంఘాల ఆందోళన
బిగ్ బాస్ (Bigg Boss) ... ఎన్నో సంవత్సరాలుగా హిందీలో లోకప్రియమైన రియాలిటీ షో. ఎందరో సెలెబ్రిటీలు, ఎంతో గ్లామర్... వారి మధ్య ఒక టైటిల్ కోసం పోరు. వీరందరినీ ఆట ఆడిస్తూ బిగ్ బాస్. ఆ పోరులో వారు ఏమి చేసినా చెల్లు. హిందీలో వచ్చిన ఆదరణను చూసి తెలుగు, తమిళ్ వంటి భాషల్లో కూడా మొదలయ్యింది బిగ్ బాస్. అయితే, టీఆర్పీల కోసం బిగ్ బాస్ లో సెలెబ్రిటీలు చేసే విన్యాసాలను చూసి జనాలు తట్టుకోలేకపోతున్నారు.
హిందీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న షోను నిలిపివేయాలని ఒకవైపు నుంచి కర్ణీ సేనా, ఇంకోవైపు నునిచ్ CAIT(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ షో వల్ల భారతదేశం సంప్రదాయాలు, విలువలు మంటగలిసిపోతున్నాయని వాపోతున్నారు.
షోలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఒకే మంచంపై పడుకోబెట్టడం, వారిచే పొట్టి పొట్టి బట్టలు వేయించడం, ఇవన్నీ టీఅర్పీల కోసమే అంటున్నాయి సంఘాలు. దాన్ని వెంటనే నిలిపివేయాలని వారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ కు లేఖ రాసారు. ఈ రియాల్టీ షో ను కుటుంబ సభ్యులంతా కలిసి చూసేందుకు వీలు లేదు అని వారు వాపోతున్నారు.
2017లో తమిళ బిగ్‌బాస్ వెర్షన్ చిక్కుల్లో పడింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారంటూ హిందూ మక్కల్ కట్చి అనే సంఘం షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో షోలో పాల్గొన్న తమిళ నటులు ఓవియా, నమిత, గంజా కరుప్పు, హారతిలపై పోలీసు కేసు కూడా నమోదైంది.
షోలో 75 శాతం దుస్తుల్లేకుండా తిరుగుతున్నారని, నోటి కొచ్చిన బూతులు మాట్లాడుతున్నారని ఆ సంఘం ఆరోపించింది. వారి మాటలు, ప్రవర్తన ఏడు కోట్ల తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు. షోను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది.
కుటుంబమంతా కలిసి చుడాలా? వద్దా?
అసలు బిగ్ బాస్ వంటి షోల వల్ల ప్రయోజనాలు లేకపోగా నట్టింట్లోకి అసభ్యకర వ్యవహారం వస్తోందనే చెప్పాలి. ఒకరి మీద ఒకరు చేసే కుట్రలూ, వాడే అసభ్యకర పదజాలం, తప్పుడు వ్యవహారాలు ఇవన్నీ ఎదిగే పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనందరికీ తెలుసు. ఇలాంటి షోను ప్రసారం చేయడానికి ముందు సెన్సార్ బోర్డుకు చూపించి వారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ప్రసారం చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ షోను అందరూ చూసేలా కాకుండా ఏజ్ లిమిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
ఇంత జరుగుతున్నా తమిళ్ బిగ్ బాస్ లా అన్ని సద్దుమణిగి హిందీ బిగ్ బాస్-13 కొనసాగుతుందో లేక అధికారులు చర్యలు తీసుకుంటారో చూడాలి.
బిగ్ బాస్ -3 : హాట్ హాట్ గా సాగిన ఎవరు గొప్ప కాంటెస్ట్..!
బిగ్ బాస్3: బాబా భాస్కర్, వితికాల మధ్య పోటీ జరగనుందా??