చారిత్రక తీర్పుపై ఉత్కంఠ.. కేంద్రం అలర్ట్
By సుభాష్ Published on 30 Sept 2020 9:20 AM ISTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై నేడు (సెప్టెంబర్ 30) 10.30 గంటలకు లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. 28 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ తుది దశకు చేరి బుధవారం తీర్పు వెల్లడి కానుండటంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ధ్వంసం చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులందరూ కోర్టు ముందుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 49 మందిని నిందితులుగా గుర్తించగా, వీరిలో 17 మంది మరణించారు. మిగిలిన 32 మంది ఉన్నారు.
ఈ నిందితుల జాబితాలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వాణీ, ఎం. మురళీధర్‌జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్‌సింగ్, సాక్షి మహరాజ్ తదితులున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రను ఏర్పాటు చేశారు. కాగా, ఉమా భారతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె రిషికేష్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అనుమతి ఇస్తే కోర్టుకు హాజరు అవుతానని సోమవారం ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా అటెన్షన్..
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ చారిత్రక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అటెన్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా కేంద్రం అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సున్నితం, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది. దర్యాప్తు తర్వాత అందిన అధారాలు, 351 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది.