ది మ్యాన్‌ బియాండ్‌ ది బిలియన్స్‌

By మధుసూదనరావు రామదుర్గం  Published on  31 July 2020 3:27 PM IST
ది మ్యాన్‌ బియాండ్‌ ది బిలియన్స్‌

భారతీయ ఐటీ పరిశ్రమ దిగ్గజం, విప్రో సంస్థ ఛైర్మన్‌ అజీమ్‌ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జీవిత చరిత్ర పుస్తకంగా తీసుకు వస్తున్నట్లు ప్రముఖ ముద్రాపక సంస్థ హాపర్‌ కోలిన్స్‌ వెల్లడించింది. సందీప్‌ ఖన్నా, వరుణ్‌ సూద్‌లు రచనా బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. ఇండియాలో రెండో ధనవంతుడిగా పేరొందిన ప్రేమ్‌జీ బిలియన్ల కొద్ది సంపద సృష్టించడమే కాదు.. అందులో 75శాతం పేదల సాయం కోసం, సామాజిక సేవకోసం విరాళంగా ప్రకటించిన మహా మనీషి.

వారెన్ బఫేట్‌, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ రచించిన ప్లెడ్జ్‌పై సంతకం చేసిన ప్రథమ భారతీయుడు ప్రేమ్‌జీ. కేవలం ధనవంతుడని పేరు తెచ్చుకుంటే అందులో థ్రిల్‌ ఏముంది అంటాడు బిల్‌గేట్స్‌. తన సేవానిరతికి ప్రేమ్‌జీ కేంద్రప్రభత్వం ఏటా ప్రకటించే అత్యున్నత పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

అజీమ్‌ హసీమ్‌ ప్రేమ్‌జీ 1945 జులై 24న ముంబైలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి మహమ్మద్‌ హసీమ్‌ ప్రేమ్‌జీ బర్మా రైస్ ‌కింగ్‌గా పేరు గడించారు. మహమ్మద్‌ అలీ జిన్నా ప్రేమజీ తండ్రి మహమ్మద్‌ ప్రేమ్‌జీని పాకిస్తాన్‌కు వచ్చేయమని కోరారు. కానీ మహమ్మద్‌ ప్రేమ్‌జీ భారత్‌లోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. 1945లో అంటే ప్రేమ్‌జీ పుట్టిన ఏడాది మహమ్మద్‌ ప్రేమ్‌జీ వెస్ట్రన్‌ ఇండియన్‌ వెజిటబుల్‌ ప్రాడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీని మహారాష్ట్రలోని అమాల్నర్‌లో ప్రారంభించారు. ఈ కంపెనీ సన్‌ఫ్లవర్‌ వనస్పతి (వంటనూనె), లాండ్రీ సోప్‌ 787 తయారు చేసేది.

అజీమ్‌ ప్రేమ్‌జీ యూఎస్‌ఏలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. అనంతరం యాస్మీన్‌ను పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు.. రిషాద్‌ ప్రేమ్‌జీ, తరీఖ్‌ ప్రేమ్‌జీ. ఇప్పుడు పెద్ద కుమారుడు రిషాద్‌ ప్రేమ్‌జీ విప్రో లి. కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

వ్యాపారవేత్తగా..

అజీమ్‌ ప్రేమ్‌జీ 1966లో తండ్రి మరణానంతరం యూఎస్‌ఏ నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశారు. అప్పడే విప్రో పగ్గాలు చేతపట్టారు. ది వెస్ట్రన్‌ వెజిటబుల్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీని ప్రేమ్‌జీ తదనంతర కాలంలో హేర్‌కేర్‌ సోప్‌లు, బేకరీ ఫ్యాట్‌లు, బేబీ టాయిలెటరీస్‌ తదితరాలను తయారు చేసే కంపెనీగా మార్చారు. 1980లో ఐబీఎం, ఇండియా నుంచి బైటకి వచ్చాక రానున్న కాలంలో ఐటీ ప్రాధాన్యాన్ని గ్రహించి తన కంపెనీ పేరును విప్రోగా మార్చారు. ఐటీ రంగంలో ప్రవేశించాక ప్రేమ్‌జీ అమెరికన్‌ కంపెనీ సెంటినల్‌ కంప్యూటర్‌ కార్పొరేషన్‌ సాంకేతిక సహకారాన్ని తీసుకుని చిన్న కంప్యూటర్ల తయారీని ప్రారంభించారు.

సమాజ సేవకుడిగా..

పోగుపడిన సంపద మనిషిలో సాధారణంగా అహంకారాన్ని కలిగిస్తుంది. తనకికి ఎదురులేదన్న అహం నానాటికీ పెరిగిపోతుంటుంది. అంతకంతకు సంపాదించి కూడబెట్టాలన్న దురాశ పెచ్చుపెరుగుతుంది. అయితే కొందరు మాత్రం శ్రమించి సంపాదించిన సంపదలో సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని ఆకాంక్షిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారే విప్రో అధినేత అజీజ్‌ ప్రేమ్‌జీ. 2011లో లాభాపేక్ష లేకుండా అజిమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రారంభించారు.

2010 డిసెంబర్‌లో ప్రేమ్‌జీ దేశంలోపాఠశాల విద్యావ్యవస్థ బలపడాలన్న కాంక్షతో 2 బిలియన్ల యూఎస్‌ డాలర్లు విరాళంగా ఇచ్చారు. దీని కోసం అజిమ్ ‌ప్రేమ్‌జీ విప్రోలో తనకున్న 213 మిలియన్ల ఈక్విటీ షేర్లను అజిమ్‌ ఫౌండేషన్‌కు బదిలీ చేశారు. 2019లో అజిమ్‌ ప్రేమ్‌జీ విప్రోలో తన వాటాగా ఉన్న షేర్లలో 34శాతం అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో ఉంచాడు. ఇదే సమయంలో ఫౌండేషన్‌ ట్రస్టుకు డోనేషన్లు కావాలంటూ ఎవరికైనా మెసేజ్‌లు వస్తుంటే అవి నకిలీగా గుర్తించాల్సిందిగా చెప్పారు.

సేవా నిరతికి అవార్డులు ..

బిజినెస్‌వీక్‌ అజిమ్‌ ప్రేమ్‌జీని అత్యున్నత ఎంట్రప్రెన్యూర్‌ గా పేర్కొంది. 2000లో మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. 2006లో నేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ ముంబై లక్ష్య బిజినెస్‌ విజినరీ అవార్డుతో సత్కరించింది. 2009లో వెస్లియన్‌ యూనివర్సిటీ ప్రేమ్‌జీ సామాజిక సేవలకు గానూ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం 2005లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో సత్కరించింది.

అజీమ్‌‌ ప్రేమ్‌జీ ని పారిశ్రామికవేత్తగానో.. ఎంట్రప్రెన్యూర్‌గానో.. విప్రో అధినేతగానో గుర్తించడమే కాదు.. తనలోని దానగుణాన్ని, మానవత్వాన్ని, సాటివారికి సాయపడే సుగుణాన్ని గుర్తించగలగాలి. అప్పుడే మనిషి ఎదిగాక డబ్బుకోసం కంటే తన దేశం సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో అదే చేస్తాడు. విప్రో ప్రేమ్‌జీ సరిగ్గా అలాంటి వారే!!

Next Story