పల్నాడులో హైటెన్షన్‌.. బోండా ఉమ, బుద్దా వెంకన్న కారు ధ్వంసం..

By అంజి
Published on : 11 March 2020 2:02 PM IST

పల్నాడులో హైటెన్షన్‌.. బోండా ఉమ, బుద్దా వెంకన్న కారు ధ్వంసం..

ముఖ్యాంశాలు

  • గుంటూరులో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్న కారుపై దాడి
  • కారు అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయి: చంద్రబాబు

గుంటూరు: జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. పెద్ద పెద్ద కర్రలతో వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా కారులో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసి లోపల ఉన్నవారిపై బయటి వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు.

బుధవారం మాచర్ల ప్రాంతంలో బోడా ఉమా, బుద్దా వెంకన్న పర్యటించారు. విషయం తెలుసుకున్న ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు వారి కారును బైక్‌లతో వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో బుద్దా వెంకన్న ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాగా కారులో ఉన్న న్యాయవాది కిశోర్‌ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కారుపై దాడి ఘటన గురించి బొండా ఉమా, బుద్దా వెంకన్నతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ అనుమతించకపోవడంతో న్యాయపరమైర సమస్య పరిష్కారానికి వెళ్లామని.. ఈ క్రమంలోనే కారుపై దాడి జరిగిందని న్యాయవాది కిశోర్‌ తెలిపారు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. తాను, బుద్దా వెంకన్న వెళ్తున్న కారుపై కొందరు ఒక్కసారిగా దాడి చేశారని అన్నారు న్యాయవాది కిశోర్‌కు తలకు బలమైన గాయం అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి తప్పించుకొని మర్కాపురం వైపు వెళ్తుంటే.. మళ్లీ అడ్డుకున్నారని, ఈ క్రమంలో తమకు రక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపై కూడా దాడి చేశారన్నారు.

ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేనేలేవన్నారు. పులివెందులలో పోలీసులే నామినేషన్లు వేయనివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జరిగిన ఘటనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Next Story